పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

48

ప్రపంచ చరిత్ర

తమ నగరరాజ్యముల నన్నింటిని కలిపి ఒక రాష్ట్రముగానో, రాజ్యముగానో, ప్రజారాజ్యముగానో చేయుటకు గ్రీకులు సమ్మతించలేదు. నగరరాజ్యములు వేటి కవి ప్రత్యేకముగా స్వతంత్రముగా నుండుటయే గాక అవి దాదాపు ఎల్లకాలముల అన్యోన్యము పోరాడుచుండెను, వారిలో వారికి తీవ్రమగు స్పర్థలుండుటచే, తరుచు యుద్ధములలోనికి దిగుచుండిరి.

అయినను ఈ నగర రాజ్యముల నేకముగా బంధించు సమాస విషయములు లేకపోలేదు. వారికి భాష సమానము. విజ్ఞానము సమానము. మత మొక్కటే. వారి మతమున ననేక దేవుళ్లు, దేవతలు ఉన్నారు. ప్రాచీన హిందువుల పురాణములవంటి అందమైన, అమూల్యమైన పురాణములు వారికిని గలవు. సుందరమగుదానినెల్ల వా రుపాసించిరి. ప్రాతకాలమునాటి వారి చలువరాతి విగ్రహములు, శిలా విగ్రహములు కొన్ని నేటికికూడ నిలిచియున్నవి. అవి సౌందర్యమును వెలిగ్రక్కుచున్నవి. శరీరముల నారోగ్యముగా, అందముగా పెట్టుకొనుట వారువిధిగా చూతురు. అందుకై ఆటలను, పోటీపందెములను వా రేర్పాటుచేసికొనుచుండెడి వారు. గ్రీసులోని ఓలింపియా యను ప్రదేశమువద్ద అప్పుడప్పు డీ యాటలు మిక్కిలి వైభవముగా జరుగుచుండెడివి. అప్పుడు గ్రీసుదేశ మన్నిప్రాంతములనుండి జనులు వచ్చి సమావేశ మగుచుండిరి. నేడుకూడ జరుగుచున్న ఓలింపిక్ ఆటలనుగూర్చి నీవు వినియుందువు. ఓలింపియాలో జరిగిన గ్రీకుల ఆటలనుండి గ్రహించి ఈ పేరు నేడు వేర్వేరు దేశములకు జరుగు పోటీపందెములకును, ఆటలకును పెట్టబడినది.

కాబట్టి గ్రీకు నగరరాజ్యములు ప్రత్యేకముగా జీవించుచుండెడివి. ఆటలప్పుడు కలిసికొనుచుండెడివి. తమలోతాము పోరాడుచుండెడివి. కాని బయటనుండి ఏదైన గొప్ప ప్రమాదము వచ్చినప్పుడు అవి యన్నియు ఏకమై వారించుచుండెడివి. అట్టి ప్రమాదము పర్షియనుల దండయాత్ర. ముందు ముందు దానిని గురించి కొంత చెప్పవలసి యున్నది.