పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గ్రీకుల నగర రాజ్యములు

47


ములను గూర్చి యాలోచించి శాసనములను నిర్మింతురు. ఈ విధముగా సామాన్యుడగు వోటరు తన దేశపరిపాలనకు పరోక్షముగా సాయపడుచున్నాడు.

ఇదంతయు గ్రీసుతో సంబంధించినది కాదు. ఇట్టి కష్టసమస్య రాకుండ గ్రీసుచేసికొన్నది. నగరరాజ్యములకంటె పెద్దరాజ్యముల నది పెట్టుకొనలేదు. నేను చెప్పినట్లుగా గ్రీకులు గ్రీసునంతను, దక్షిణఇటలీనీ, సిసిలీని, ఇతర మధ్యధరాతీరములను ఆక్రమించినప్పటికిని వారు సామ్రాజ్యమును స్థాపింప ప్రయత్నించలేదు. వారి వశములో నున్న యావత్ప్ర దేశములకును ఒకే ప్రభుత్వము పెట్టుకొన ప్రయత్నించలేదు. పోయిన చోట్లనెల్ల వారు తమ ప్రత్యేక నగరరాజ్యమును స్థాపించిరి.

ఇండియాలోకూడ, తొలిరోజులలో, చిన్న ప్రజాప్రభుత్వము లుండెడివి. అవి గ్రీకునగరరాజ్యములవంటి రాజ్యములు. కాని అవి చిరకాలము జీవించినట్టులేదు. పెద్దరాజ్యములలో అవి లీనమైపోయినవి. ఆ విధముగానే చాలకాలమువరకు మన గ్రామపంచాయతులు గొప్ప పలుకుబడి సంపాదించినవి. ప్రాచీనకాలమునాటి ఆర్యులు, తాము పోయిన చోట్ల నెల్ల చిన్న నగరరాజ్యములు స్థాపించవలెనని యుద్దేశించియుండ వచ్చును. భూగోళమునకు సంబంధించిన పరిస్థితులను, ప్రాచీన నాగరికతలతో సంసర్గమును, వారు నివసించిన పెక్కు దేశములలో తమ యుద్దేశమును క్రమముగా వదలుకొనుటకు కారణము లాయెను. ముఖ్యముగా పర్షియాలో గొప్పరాజ్యములు, సామ్రాజ్యములును వర్దిల్లినవి. ఇండియాలోకూడ రాజ్యములు పెద్దవిగా పెరుగుట కున్ముఖములైనవి. కాని గ్రీసులో నగర రాజ్యములు చిరకాలము నిలిచియుండెను. చివరకు, చరిత్రలో ప్రసిద్ధినందిన గ్రీకుపురుషుడొకడు ప్రపంచమును జయించుటకు, మనకు తెలిసినంతమట్టుకు, మొదటి ప్రయత్నము చేసెను. అతడు ఘనుడగు అలెగ్జాండరు. ముందుముందు అతనిని గురించి కొంచెము చెప్పుకొందుము.