పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



4

ఆసియా : యూరోపు

జనవరి 8, 1931

ప్రతివస్తువును నిరంతరమును మారుచుండునని వెనుకటిజాబులో నేను చెప్పియుంటిని. అసలు చరిత్ర యనగా నేమి? — పరివర్తన వృత్తాంతమేగదా! గతకాలమున కొద్ది మార్పులే జరిగియున్నట్లయిన, వ్రాయదగ్గ చరిత్ర కొద్దిగానే యుండెడిది.

మనము బడులలోను, కళాశాలలలోను నేర్చుకొను చరిత్ర సామా న్యముగా హెచ్చుగా నుండదు. ఇతరుల సంగతి నాకు అట్టే తెలియదు. కాని నా సంగతి చెప్పవలసివచ్చిన ఆదిలో నేను నేర్చుకొన్న చరిత్ర బహుకొద్ది, హిందూ దేశచరిత్రను కొద్దిగా, బహుకొద్దిగా నేర్చుకొంటిని. ఇంగ్లాండు దేశ చరిత్ర కొద్దిగా నేర్చుకొంటిని. నేను నేర్చుకొన్న హిందూ దేశచరిత్రయైనను చాల భాగము తప్పు లేదా వికృత రూపము ధరించినది. దానిని వ్రాసినవారు మన దేశముపై సవతితల్లి ప్రేమ కలవారు. ఇతరదేశముల చరిత్రను గురించి నేను నేర్చుకొన్నది అంతంత. కళాశాలను వదలిపెట్టిన పిమ్మటనే యథార్థ చరిత్రమును కొంత నే సభ్యసించితిని. అదృష్టవశమున నా జ్ఞానమును వృద్ధిచేసికొనుటకు సావకాశము నాకు నా కారాగారవాస మొసగెను.

ఇండియా ప్రాచీననాగరికతను గురించియు, ద్రావిడులను గురించియు, ఆర్యుల యాగమనమును గురించియు ఇదివరలో నీకు వ్రాసిన జాబులలో చెప్పియుంటిని. ఆర్యులరాకకు ముందున్న కాలమునుగురించి నేను వ్రాయలేదు. నాకు దానిని గురించి అట్టే తెలియదు. ఈ మధ్యను కొద్ది సంవత్సరములకు లోపుగనే, మిక్కిలి ప్రాచీన నాగరికతా శిథిలములు ఇండియాలో కనుగొనబడినవన్న విషయము నీ కుత్సాహము కలిగించవచ్చును. ఇవి ఇండియాకు వాయవ్యదిశను 'మొహంజొదారొ అనే