పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24

ప్రపంచ చరిత్ర


ములు, సంతోషములనుగురించియు, ఆచరించిన, సాహసముతో కూడిన మహత్కార్యములను గురించియు నేను మననము చేసితిని. ఎరవాడ చెరసాలగదిలో కూర్చుండి, తన ఇంద్రజాలస్పర్శవల్ల మనమాతృదేశమునకు మరల యౌవనమును, శక్తినికలిగించిన బాపుజీని స్మరించితిని. తాత[1]ను, ఇతరులను పెక్కురను స్మరించితిని. ముఖ్యముగా మీ అమ్మను, నిన్ను తలచుకొంటిని. తరువాత కొంత సేపటికి ఉదయమున వార్తవచ్చినది. - మీ అమ్మను పట్టుకొని జైలుకు తీసికొని వెళ్ళిరని. అది నా కింపైన ఉగాదిబహుమానము. ఇట్లుజరుగునని ఎంత కాలమునుండియో అనుకొనుచున్నాను. అమ్మ పూర్తిగా సుఖముగాను, సంతుష్టితోను, ఉండుననుటకు సందేహములేదు.

కాని నీవు ఒంటరివి అయితివి. పక్షమునకొకమారు నీవు అమ్మను చూడవచ్చును. పక్షమున కొకమారు నీవు నన్ను చూడవచ్చును. మా సందేశము లొకరివి ఇంకొకరితో చెప్పవచ్చును. అయితే కాగితము, కలము తీసికొని నేను కూర్చుందును నిన్ను, తలచుకొందును. అప్పుడు నీవుసన్న సన్నగా నాపజ్జకువత్తువు. మన మెన్నియో విషయములనుగూర్చి ప్రసంగించుకొందము. గత కాలమునుగూర్చి కలలుకందము. గత కాలము కన్న భావికాలమును గొప్పగాచేయుటకు మార్గములు కనుగొందము. కాబట్టి ఈ సంవత్సరాదిదినమున మనము దృఢసంకల్పము చేసికొందము. ఈసంవత్సర మవసానదశకు వచ్చిఅంత మొందుటకు పూర్వమేమనము భావినగూర్చి కన్న కలలను వర్తమానమునకు దగ్గరగా తీసికొని రాగలుగుటకు సంకల్పము చేసికొందము, ఇండియా గత చరిత్ర కొక దేదీప్యమానమగు పుటను చేర్చగలుగుటకు సంకల్పము చేసికొందము.

  1. ఇందిర తాతగారైన మోతీలాల్ నెహ్రూ.