పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చంద్రగుప్తమౌర్యుడు : అర్థశాస్త్రము

115


సంబంధించినలెక్కలు, నూతన వస్తువులను తయారుచేయుట మున్నగు విషయములను ఈ కమిటీల సభ్యులు విచారించుచుండిరి. పురపాలక సంఘమువారు నగరముయొక్క ఆరోగ్యము, ఆదాయము, నీటిసరపరా, ఉద్యానములు, రాజభవనములు అను విషయములు విచారించుచుండిరి.

న్యాయపరిపాలనకై అప్పుడు పంచాయతీ లుండెను. అప్పీలుకోర్టు లుండెను. క్షామనివారణార్ధము ప్రత్యేకముగా ఏర్పాటులుండెను. దొరతనమువారి గిడ్డంగు లన్నిటిలోను నిలువయున్న సరకులో సగముభాగము క్షేమనివారణార్థము ఉంచుచుండిరి.

చంద్రగుప్త చాణుక్యులచే 2,000 ఏండ్ల క్రితము నిర్మింపబడిన మౌర్యసామ్రాజ్య మేతీరున నుండెను.కౌటిల్యునిచేతను, మెగాస్తనీసు చేతను ఉదహరింపబడిన కొన్ని యంశములు నే నిందు పొందుపరచితిని. వీనినిబట్టి ఆ దినములలో ఉత్తర హిందూస్థానమును గూర్చి కొంతవరకు స్థూలముగా గ్రహింపవచ్చును. రాజధానియగు పాటలీపుత్రము మొదలు నానా మహానగరములును, సామ్రాజ్యమందలి వేలకొలది పట్టణములును పల్లెలును జనసంకీర్ణమై యొప్పియుండవలెను. సామ్రాజ్యమందలి ఒక భాగమునుండి వేరొక భాగమునకు ఘంటాపథము లుండెను. ప్రధాన "రాజపత్త్రము" (రాజమార్గము) పాటలీపుత్రము గుండా వాయవ్య సరిహద్దులవరకు పోయియుండెను. కాలువ లనేక ముండెను. వాటిని సరిచూచుటకును, పొలములకు నీరు పారించుటకును ఒక ప్రత్యేక ప్రభుత్వశాఖ పనిచేయుచుండెను. నౌకాశ్రయములు, రేవులు, వంతెనలు, ఒకచోటనుండి వేరొకచోటికి తిరుగు అనేకములైన పడవలు, ఓడలు - వీనిని సరిచూచుటకు నౌకాశాఖ యను ప్రత్యేకశాఖ పనిచేయుచుండెను. ఓడలు సముద్రమును దాటి బర్మాకును, చీనాకును పోవుచుండెను.

ఇట్టి సామ్రాజ్యమును చంద్రగుప్తుడు 24 సంవత్సరము లేలెను. క్రీ. పూ. 296 సంవత్సరమున నతడు కీర్తికాయు డయ్యెను. తరువాత జాబులో మౌర్యసామ్రాజ్య కథను సాగింతము.