పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/109

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
ప్రసిద్ధవిజేత, కాని దురహంకార పూరితుడగు యువకుడు
107
 


గ్జాండరు నెదిరించెను. గ్రీకుచరిత్రకారు లతనిని గ్రీకు సంప్రదాయానుసారము పోరను అనిరి. అతని అసలు పేను పోరసును పోలినదే అయి యుండవచ్చును. కాని మన కది తెలియదు. పోరసు ధైర్యముగా పోరాడెననియు, అతనిని అలెగ్జాండరు సులభముగా జయించలేకపోయే ననియు చెప్పుదురు. పోరసు అమిత పరాక్రమశాలి, దీర్ఘకాయుడు. అతని ధైర్యసాహసములను మెచ్చి అలెగ్జాండరు అతనిని ఓడించినప్పటికిని కూడ తన రాజ్యమున కాతనిని తన ప్రతినిధిగా ఏర్పరచెను. రాజుగా నున్న పోరసు నేడు గ్రీకుల 'సాత్రాపు', అనగా గ్రీకులతరపున పాలకుడయ్యెను.

వాయవ్యదిశనున్న కైబరుకనుమగుండా, రావల్పిండికి కొంచె ముత్తరములోనున్న తక్షశిలమీదుగా అలెగ్జాండరు ఇండియాలో ప్రవేశించెను. నేడుసైతము ప్రాచీననగరమగు తక్షశిలా శిథిలములను మనము చూడవచ్చును. పోరసును ఓడించి అలెగ్జాండరు దక్షిణముగా గంగ వైపునకు వెళ్ళదలచెను. కాని అత డట్లు చేయలేదు. సింధునదీ లోయ ననుసరించి యాతడు తిరిగి వెళ్ళి పోయెను. అలెగ్జాండరు హిందూస్థాన హృదయమనదగు గంగాప్రాంతమునకు వచ్చియుండినచో ఏమి జరిగెడిదో! అక్కడకూడ అతడు విజయము సాదించియుండునా? లేక హిందూదేశసైన్యములే అతనిని ఓడించియుండునా? పొలిమేరలో నుండు పోరసురాజు అతనిని మూడుచెరువుల నీళ్లు త్రాగించెను. మద్య హిందూస్థానమందలి పెద్దరాజ్యములు అతని పురోగమనము నరికట్ట సమర్ధములయి యుండియుండును. అలెగ్జాండరు ఇష్టానిష్టములెట్లున్నను అతని సైనికులే ముందుకార్యమును నిర్ణయించిరి. చాల సంవత్సరములు దేశాటనము చేసియుండుటచే వా రలసిపోయిరి. బహుశా భారతసైనికుల పోరాటవైఖరి చవిచూచియుండుటచే, వారు పరాజయమువచ్చునేమోయని జంకియుందురు. కారణ మేదైనను తిరిగి వెళ్ళుటకే సైన్యము నిశ్చయించి, పట్టుబట్టినది. అలెగ్జాండరు ఒప్పుకొనక తప్పినదికాదు. తిరుగు