పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/106

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
104
ప్రపంచ చరిత్ర
 


సైన్యమును కూర్చెను. అలెగ్జాండరును "ఘనుడు" అందురు. చరిత్రలో నాతడు మిక్కిలి ప్రసిద్ధుడు. ముందుగా తండ్రి శ్రద్ధతో చేసిన పనివల్లనే అతడు అనేకకార్యములు చేయుటకు సాధ్యపడినది. నిజముగా అలెగ్జాండరు గొప్పవాడో, కాడో అన్నవిషయము సందేహాస్పదము. నే నాతనిని వీరునిగా తలంచను. జీవించినది కొద్దికాలమే యైనను అతడు తన పేరు రెండు ఖండములలో వ్యాపింపజేయగలిగెను. ప్రపంచవిజేతలలో ప్రథముడని చరిత్రలో చెప్పుట కలదు. మధ్య ఆసియానడిబొడ్డున సికందరను పేరుతో అతనిని నేటికిని స్మరించుచుందురు. నిజమున కాతడెట్టివాడైనను, చరిత్రమాత్రము అతని నామమున కొకవిధమగు ఇంద్రజాలశక్తిని ఆపాదించినది. అనేకనగరముల కాతని పేరు పెట్టబడెను. అవి నేటికిని నిలిచియున్నవి. అందు మిక్కిలి గొప్పనగరము ఈజిప్టులోని అలెగ్జాండ్రియా.

రాజగునాటికి అలెగ్జాండరువయస్సు ఇరువది సంవత్సరములు మాత్రమే. గొప్పతనమును సాధించవలె నను ఆకాంక్షతో అతడు తన కూర్చిన, శ్రేష్ఠమగు సైన్యమును తీసికొని, తనప్రాతశత్రువగు పర్షియా మీదికి దండయాత్ర సాగింప నువ్విళ్లూరుచుండెను. అతని తండ్రి ఫిలిప్పు అన్నను, అతడన్నను గ్రీకులకు ఇష్టము లేదు. కాని వారి బలముచూచి కొద్దిగా భయపడిరి. కాబట్టి వారు, ఒకనితరువాత నొకనిని, పర్షియాకు దండెత్తిపోవు గ్రీకుసైన్యములకు కెప్టెను-జనరల్‌గా అంగీకరించిరి. ఈవిధముగా క్రొత్తగా తలయెత్తుచున్న ఒక గొప్పజాతికి వారు తల యొగ్గిరి. థీబ్సు అను పేరు గల ఒక గ్రీకునగరముమాత్రము ఆతనిపై తిరుగబడెను. దాని నాతడు క్రౌర్యముతో తీవ్రముగా దండించెను. అతడీ ప్రసిద్ధనగరమును విధ్వంసముచేసెను. అనేక నగరవాసులను హతమొనర్చెను. వేలకొద్ది నగరవాసులను బానిసలుగా అమ్మివేసెను. ఇట్టి కిరాతచర్యలు గ్రీకులను భీతావహులను చేసెను. ఇట్టి అనాగరికచర్యలు చూచి మన మతనిని మెచ్చుకోలేము. ఇట్టి చర్యలు మన మసహ్యించుకొందుము. అట్టివానికి మనము దూరముగా నుందుము.