పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామావధూటితారావళి

43


సీ.

నీయాత్మ నాయాత్మ నిజముగా నొకటంచు నామనంబునఁ జాల నమ్మియుంటి
నాతోడఁ జేసిననమ్మిక లెప్పుడు మఱచిపా వని రూఢి పఱిచియుంటి
నెవరెన్ని చెప్పిన నిఁక నన్ను విడనాడవంచు నామది నిశ్చయించుకొంటి
మనశరీరము లున్న మట్టుకు మనలోనఁ బొర కల్గదనమి తలపోసియుంటి


గీ.

వనితరో యిప్పు డిటు కాలవశముచేత మనల కెడబాపు కల్గె నీమది విరక్తిఁ
బొరయ లోగడ సంగతుల్ మఱచిపోవ మంచిమార్గము కాదు రామావధూటి.


సీ.

ఘన మైనమోహంబుఁ గలవాఁడ నౌటచే లలన నే నీకింత తెలుపవలసెఁ
బట్టుకై యభిమానపడువాఁడఁ నౌటచేఁ దెఱవ నీకింత బోధింపవలసెఁ
బ్రౌఢానుభవ మాసపడువాఁడ నౌటచే నింతి నిన్నింత ప్రార్థింపవలసెఁ
జెలిమిపై లక్ష్యంబు గలవాఁడ నౌటచే వనిత నీకింతగా వ్రాయవలసెఁ


గీ.

గాక తమతమ యక్కఱల్ గడపుకొనెడువార లందఱతో పాటివాఁడ నైన
నింత యేటికి? నీకు నొక్కింతయైన మనమునను దయ లేదు రామావధూటి.


సీ.

కొంతకాలము నీదు గుణగణంబు లెఱుంగనేరక భయముచే నూరకుంటిఁ
గొంతకాలము నీకుఁ గోపమేమో యని సంశయంబునఁ జాల జంకియుంటిఁ
గొంతకాలము మది గోర్కెలూరఁగ సంతనపురాయబారముల్ నడుపుచుంటిఁ
గొంతకాలము నిన్నుఁ గూడియు పుల్లాయమాటలు మనములో నాటియుంటిఁ


గీ.

గాని యీయూరిలోనుండు కాలమందునైన తమిదీఱ రతులలో నలరనైతి
నేమి సేయుదు నయ్యయో యిప్పుడిటుల మదిని దపియించవలసె రామావధూటి.


సీ.

నీమోము నే నొక్క నిముసంబు గనుఁగొన శశి యేటి కనిపించుఁ జంద్రవదన!
నీమోవి నే నొక్కనిముస మానిన దొండపండేటి కనిపించుఁ బల్లవోష్ఠి!
నీకను లే నొక్కనిమిషంబు గనినఁ బద్మమ్మేటి కనిపించుఁ దరళనయన!
నీబొమల్ నే నొక్కనిమిషంబు గనుఁగొన్ విల్లేటి కనిపించు విలసితభ్రు!


గీ.

నీదుచెక్కులు నే నొక్కనిమిష మైనఁ గనిన నద్దంబు లేమిటి కనుచుఁ దోఁచు
నిట్టి నినుఁ బాసి యున్న నా కిపుడు జన్మమే వృథా యని తోఁచు రామావధూటి.


సీ.

శ్రీమించునెమ్మోము తామరవిరి తళ్కుఁ గన్నులు విరిసినకైరవములు
కుదురైనరదనముల్ కుందకుట్మలములు తీరైననాసిక తిలసుమంబు
తరళాధరోష్ఠంబు దాసానిపుష్పంబు పొలుపైనపొక్కిలి పొన్నపువ్వు
అదోఁక లగుజంఘ లరఁటిపూమొగ్గలు చక్కనిమెయి శిరీషప్రసూన