పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

రామావధూటితారావళి


గీ.

నీటుగా వచ్చుచోఁ జూచి ‘నేఁడు దృష్టి తాఁకు!’ నని ప్రొద్దు గ్రుంకినతత్ క్షణంబు
జీడిగింజస దృష్టి తీసినవిధంబు మఱచిపోవంగఁ దరమె రామావధూటి.


సీ.

ఊరు నేఁడే బైలుదేరుట నిశ్చయం బైనచో నెదురు మాటాడలేక
మోము వెల్వెలఁబోవ ముచ్చటాడుచుండి ధ్యానంబు వేఱుగాఁ దల్లడిలుచు
నామాట లీమాట లడుగుచు నుచితోపచారముల్ సేయుచు గారవమున
భోజనానంతరంబునను దమ్ములము గుడాన్వితంబుగ నిచ్చి యవలఁ జేయి


గీ.

చేతిలో నుంచి ‘యూరికి క్షేమముగను బోయి శీఘ్రంబు రమ్మ’ని పొలుపు మీఱ
నన్నుఁ బంపిన యానాఁటినైపుణంబు మఱచిపోవంగఁ దరమె రామావధూటి.


సీ.

కడుపులోఁ గమ్మనికాంక్ష లూరుచునుండు నిను జ్ఞాపకము సేయఁ గనకగాత్రి
కనుల కేమో తళుక్కను నట్లుగాఁ దోఁచు నిన్నెన్న సౌదామనీలతాంగి
నిలువెల్ల నేమేమొ పులకించు నీతీరు స్మరియించ శీతాంశురుచిరసుముఖి
సారెకు నేమేమొ నో రూరుచుండు నీ మాటలఁ దలఁప బింబాధరోష్ఠ


గీ.

యోచనగ నుండు మది కేమి తోఁచకుండు దిగులుగా నుండు మరుమాయ దెలియకుండు
దైవ మిఁక ముందెటులు సేయఁ దలఁచినాఁడొ మనకుఁ దెలియంగరాదు రామావధూటి.


సీ.

ధరలో ననేకసుందరు లుందు రైన వారలయందు నెందు నీవలెనె మంచి
గుణము విశ్వాసంబు కుదురు సత్యము తప్పకుండుట యుక్త మయుక్త మెఱిఁగి
తివురుట వినయవిధేయత లభిమాన మాదరంబు దయామయాంతరంగ
మందంబు చందంబు నళుకును బెళుకును సమయంబునను దెంపు సౌష్ఠవంబు


గీ.

దగినసరసునిఁ జేపట్టి తప్పు లొప్పు లెఱిఁగి విడువక ప్రేమచే నేలికొనుట
తెలివితేట లుపాయముల్ లలితవాక్యమాధురియు నిన్ని గలవె రామావధూటి.


సీ.

కలగంటి నొకరాత్రి కనకాంగి నీతోటి సమరతిలోఁగేళి సల్పినట్లు
కలగంటి నొకరాత్రి కలకంఠిరో నీ వుపరతిలో నను గుపాల్పఱచినట్లు
కలగంటి నొకరాత్రి కలికి గాఢాలింగనాదిసౌఖ్యంబుల నలరినట్లు
కలగంటి నొకరాత్రి కమలాక్షి నీతోడ బంధలీలల జాల బడలినట్లు


గీ.

ఒక్కరాతిరి కలఁగంటి సొక్కి నేను నీదుకెమ్మోవియానుచో నీవు నాదు
పైపెదవినానుచును ఱెప్పపాటులేక మన్ముఖముజూచునట్లు రామావధూటి.