పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామావధూటితారావళి

41


జేసిన నేమాయెఁ జిడిముడి లేక విచ్చలవిడి ముచ్చట్ల మెలఁగవలయు
మెలఁగిన నేమాయె నెడబాయ కెల్లప్పు డేకీభవించి వర్తింపవలయు


గీ.

నటుల వర్తింప నేమాయె నవ్విధమునఁ జెడని ప్రేమలతోఁ దను ల్విడువవలయు
నహహ యివి యెల్లఁ బూర్వపుణ్యమునఁ గాక మనుజులకు వీలుపడునె రామావధూటి.


సీ.

మేడలోఁ జన్నీళ్ళు మెండుగాఁ జల్లించి తడియొత్తి చిఱిచాఁప లిడి సుమృదుల
తల్పంబుఁ బఱిచి చెంతల మిన్న లగుషర్భతులును షోడావాటరులును గల్గు
సీసాలు చక్కెరల్ జీడిపప్పులును బాదముపప్పులును మంచి ద్రాక్షపండ్లు
కజ్జాయములు ముంతఖర్జూరము ల్గలపళ్ళెముల్ ప్రేమతో భద్రపఱిచి


గీ.

భోజన మొనర్చి నేను రాఁ బొలుపు మీఱ శయ్యపైఁ జేర్చి యుచితోపచారములను
వేసఁగిపగళ్ళ సుఖియింపఁ జేసినట్టి మంచి మఱవంగఁ దరమె రామావధూటి.


సీ.

కమలాక్షి నీమోముఁ గనుఁగొన్న నాకన్ను లేమియుఁ గనుఁగొన నేవగించు
బింబోష్ఠి నీదు మోవిని గ్రోలునాజిహ్వ యేమియుఁ గ్రోలంగ నేవగించుఁ
గలవాణి నీదు పల్కులు విన్న నావీను లేమియును వినంగ నేవగించుఁ
గనకాంగి నీతోడఁ గలసిన నాదుమే నేమియు స్పృశియింప నేవగించుఁ


గీ.

సరసిరుహగంధి నీమేని పరిమళంబుఁ గొన్న నానాస యెదియు మూకొనఁగఁబోదు
అహహ! పంచేద్రియములు నీయందె నాటి మఱల విఁక నేమి సేతు రామావధూటి.


సీ.

సౌధంబుపై నీళ్ళు చల్లించి చిమ్మించి చాపలు పఱిపించి చారురత్న
కంబళంబులు వేసి ఘనహంసతూలికాతల్పంబు బఱిపించి తమక మలర
నందుపై ననుఁ జేర్చి యగరుగంధముఁ బూసి చలువపన్నీరులు చల్లి మల్లె
పూదండలును జాజిపూదండ లురమున వేసి చల్లనిగాలి వీచుచుండ


గీ.

రమణ నీరీతి వేసవిరాత్రులందు రాగ మెచ్చంగ నిష్టోపభోగములను
నన్ను సుఖియింపఁ జేసిననాఁటికూర్మి మదికి మఱవంగ వశమె రామావధూటి.


సీ.

ఉదయమే లేచి నిల్ వదలలే కై దాఱుగడియలవఱ కుండి కదలి మేడ
డిగి వచ్చుచో వాకిటికిముందు గుబగుబ నీ వేఁగి యీవాల నావలఁ గని
సై యన నే వేగఁ జని బసలోఁ గల పనులెల్లఁ దీర్చి సాపాటు చేసి
గంధంబుఁ బూసి వేడ్కల మించి కెలఁకుల నమ్మలక్కలు వెఱఁగంది చూడ