పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

రామావధూటితారావళి


సీ.

చిననాఁటి నుండి విజృంభించి సఖులతోఁ బొందు లొనర్చితిఁ గుందరదన
యీలాటిమోహంబు లీలాటివిరహంబు లేనాఁ డెఱుంగనే యిగురుఁబోడి
నీవంటిచెలియతో నేస్త మబ్బె నటంచుఁ జాలఁ బొంగితిఁగదే జలజగంధి
యిప్పు డిట్లెడఁబాసి యేఁగుట నాపూర్వపుణ్యంబు గాఁబోలుఁ బూవుఁబోఁడి


గీ.

యింతపాపంబు జగతిలో నెచటనైనఁ గలదె నాపాప మిటు పండెఁగాక యైనఁ
దరుణి నీమది కరుణమాత్రంబు తప్పి పోవకున్నను జాలు రామావధూటి.


సీ.

ఒకనాఁటి కలలోన నుదయమే నినుఁ బట్టి రతిగోల ‘నిపుడు నిస్త్రాణఁజేయు
మద్యాహ్న’ మని తెల్పి మద్యాహ్నమున రాఁగ ‘విడెము సేయుండ’ని విడెము సేసి
నంతట ‘నిద్రించి యావల మీయిష్ట’ మని కూర్మి లేచిన వెనుక ‘జుట్టు
దువ్వెద రమ్మ’ని దువ్వుచు ‘రాత్రికి సిస’లని చేతిలోఁ జెయ్యి వేసి


గీ.

యిటుల దంధనసేయునంతటను నిద్ర మేలుకొని గుండెఝల్లన మేనుమఱచి
సొమ్మసిల్లి యొకింత యుసూరుమనుచు మదిని దపియించుచుంటి రామావధూటి.


సీ.

‘బోఁటి నేఁ డూరికిఁ బోవలె’ ననుచు నే నొక్కింత పలుకంగ నుస్సురనుచు
‘నెపుడుఁ బ్రయాణాలె యేమి సేతు’ నటంచు గనుఁగొలఁకుల నీరు గ్రమ్మఁ గొంత
సేపున ‘కెపుడు విచ్చేయుదు రొక్కొ! యచ్చటనె యచ్చటల ముచ్చటల మరగి
యుందురో’ యన భయం బొంది నేనెన్నటికిని నట్టివాఁడఁగా నని పలుకఁగ


గీ.

నొట్టునుండి తప్పక హుటాహుటిగ రండి యనుచుఁ గౌఁగిటఁ జేర్చి బాష్పాంబు లొలుక
రేపు పోవచ్చు ననుచుఁ బ్రార్థించునట్టి మంచి మఱవంగఁ దరమె రామావధూటి.


సీ.

ఫలహారమును జేసి పవళింపఁగా వచ్చి విడెమిచ్చి “నేఁడు నేఁ దలకుఁ బోసు
కోవలె, నిట పండుకొనుఁడు మీ”రని పోయి జలకంబులాడి పూసలు ధరించి
లలి జిల్గుమల్లుసెల్లా గట్టి రవిక చేపట్టి రాఁజూచి యాపాదమస్త
కంబు గాన్పింప మోహంబునఁ బైఁబడి గ్రుచ్చి కౌఁగిటఁజేర్చి కుచయుగంబు


గీ.

బట్టఁబో రామలక్ష్మి బార్శ్వముననుండి ‘హుమ్మ’నుచుఁ బల్క నంత నే నులికిపడఁగ
‘దానితో నే’మనుచు నీవు పూనుకొన్నఠీవి మఱవంగఁ దరమె రామావధూటి


సీ.

ధరలోన జన్మ మెత్తంగ నేమి ఫలంబు సరసవిద్యల నెల్ల జదువవలయుఁ
జదివిన నేమాయె సారస్య మెఱిఁగిన చెలియతో స్నేహంబు సేయవలయుఁ