పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామావధూటితారావళి

39


గీ.

నీకుఁ దగినట్టి పురుషుఁడ నేన నాకుఁ దగినసుందరి వీవ కాఁదలఁచి చాల
వలచి యన్యోన్య మతనుని గెలిచి మిగుల మంచితో నుంటిమిగదె రామావధూటి.


సీ.

ఒకనాఁటికలలోన సకియ నీకాలిపాజేబులో జందెంబు చిక్కినట్లు
ఒకనాఁటికలలోన సకియ నీచేతిపోచీలోన నాకురుల్ చిక్కినట్లు
ఒకనాఁటికలలోన సకియ కౌఁగిఁటఁ జేర్చుతఱిఁ గంటె గడ్డానఁ దాకినట్లు
ఒకనాఁటికలలోన సకియ మెల్లన నాదుగూబలో కొక్కొరో కూసినట్లు


గీ.

లిన్నివిధమలు నచ్చట నున్న నాఁటివన్నె లన్నియుఁ గలలోన వచ్చి యిచట
గాసి గూర్చుచున్నవి నిన్నుఁ బాసి యెట్లు మరులు నిల్పఁగనేర్తు రామావధూటి.


సీ.

నమ్మినవాని నన్యాయంబు సేయుట కాశిలో గోహత్యగాదె కలికి
వలచి వచ్చినవాని వంచనల్ సేయుట నరహత్యగాదె పున్నాగవేణి
చెలిమి కోరినవానిఁ జేపట్టి విడుచుట బ్రహ్మహత్యయెకాదె పంకజాక్షి
ఆడి తప్పినదోష మన్ని దోషములలో మొదటిదోషము సుమీ మోహనాంగి


గీ.

నిన్ను నమ్మితి వలచితి నీవు నన్నుఁ బ్రేమఁ జేపట్టితివి యిఁక విడువ ననుచు
బాసఁ జేసితి విప్పు డీపగిదిఁ గూర్మి మఱచిపోవంగఁ దగునె రామావధూటి.


సీ.

చంద్రఖండంబుపైఁ జంద్రఖండము రేక నుదుటఁ గుంకుమవంకఁ బదిలపఱిచి
కొండలపై మంచు నిండియుండినరీతిఁ జనులపై మైఱైకఁ జక్కపఱిచి
కలువరేకలఁ దుమ్మెదలు వ్రాలి యున్నట్ కనుదోయి నంజనంబును ఘటించి
బంగారుప్రతిమలఁ బటిక నార్చినరీతి లలి జిల్గుమల్లిసెల్లా ధరించ


గీ.

యంగజప్రభు విజయకాహళులపగిదిఁ గాళ్ళ నందెలు పాంజెబుల్ ఘల్లురనుచు
మ్రోయ మెల్లన వచ్చి నామ్రోల నిలుచు ఠీవి మఱవంగఁ దరమె రామావధూటి.


సీ.

ఒకనాఁడు మేడపై నొంటిగా కిటికిటీలెల్ల బిగించి శయంచువేళఁ
జల్లగా నేవచ్చి మెల్లమెల్లనె ముద్దు లిడఁబోవఁగాఁ ద్రుళ్ళిపడి బిరాన
లేచి చెంగట నన్నుఁ జూచి సెబాసు రా రండి యటంచు నురంబపైకి
తిగిచి నాచిబుకంబుఁ దివురుచు నవ్వుచు మధురవాక్యముల నన్ మరులుకొల్పి


గీ.

సరసులైనట్టి నీవంటిజాణ లిట్లు చెలులమానంబులను బయల్ సేయఁదగునె
యంచు మంచిగ బోధించినట్టినేర్పు మదికి మఱవంగఁ దరమె రామావధూటి.