పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యీవ్రాతలవలనఁ బ్రయోజన మేమి? రసికాభిషలాము శ్రీనాథునిదని హేతువులతోఁ జెప్పినను జను లొప్పుకొనఁగూడదట! కాని యీవిమర్శకు లేమి చెప్పినను, చెప్పినంత మాత్రముననే యొప్పుకొనవలయును గాబోలు. 1, 2, 26, 27, 50 పద్యములు దప్ప రసికాభిలాషమునందు గల్చనలు లేనిపద్యములు వీరు మరియెన్నిసారులు మూలములు చదివియైనను జూపగలరా? వానిలోని కల్పనలు మాత్రమే ప్రౌఢముగా నున్నవని వీరియభిప్రాయమా, తక్కిన వేల కావో కారణసహితముగా వీరు నిరూపించినగదా తిరిగి యేమి చెప్పుటకైన వీలుండును!

5. రసికాభిలాషమునందు శ్రీనాథుడు ప్రయోగించి యుండడని యాధునికప్రయోగము లున్నవట! ఈసంగతి పోల్చుకొనుట కుపయోగించిన కుశాగ్రబుద్ధిని మరికొంత యుపయోగించి వీరు పైసంగతి కూడ గ్రహింపలేకపోవుట చిత్రముగా నున్నది. శిథిలములైన స్థలముల గ్రొత్తగా బూరింపబడినభాగములు కుండలీకరింపవలసిన యవసరము లేకుండ సులభముగా బోల్చుకొనగలుగుట కచ్చోటులనెల్ల వీలైనవరకు నాధునికప్రయోగములే చేయబడియుండగా “మాబుద్ధికి జూడ గ్రంధమందంతట నొక్కసైలియే కనబడుచున్నది. కాని వేర్వేరు సైలులు కనబడుటలే" దని వీరు వ్రాసినది యెంతహాస్యాస్పదముగా నున్నదో చూడుడు. ఆధునికప్రయోగముల జూపగలుగుటచే శ్రీనాథుని గ్రంథము కాదని స్థాపింపఁగలిగితి మని వీరు సంతోషింతురే కాని క్రొత్తగ బూరింపఁబడిన భాగము లున్నవే, యీనవీనప్రయోగము లందలివేమో యను సంశయము కూడ వీరు పొందరైరి. పాపము, తమయుక్తి యప్రతిహత మనుకొనిన వీరియుత్సాహమునకు భంగము కలిగినందులకు విచారింపవలసినదే. "లజ్జిలినాను" అనునది కేవల మసాధు వని వ్రాయుచున్నారు. “ఉన్నాడను" అనుదానికి "ఉన్నాను" అనునది రూపాంతర మయినట్లే, "లజ్జిలినాడను" అనుదానికి "లజ్జిలినాను" అను రూపాంతర మున్నట్లు మతాంతకము గలదు. ఆధునికప్రయోగములు గలవు. కావనినచో మనోరమాపత్రికాధిపతులచే రచింపబడి మనోరమయందు ప్రచురింపబడిన ప్రసన్నయాదవనాటకమున 21వ పుట జూడుడు. అందు “బ్రతికినావు" అనురూపము బ్రయోగింపబడినది. ఇది సాధువైన నసాధువైన బ్రకృతాంశమున కొక్కటియే. శ్రీనాథు డిట్లు ప్రయోగించియుండ డన్నదానితో నిర్వివాదనముగ నేకీభవింపవచ్చును. విమర్శకులు కష్టపడి యుదాహరించిన ప్రయోగములం బట్టి చూడ, నీగ్రంథమునందు గ్రొత్తగా బూరింపబడినభాగములే నవీనుడు రచించినట్లు తోచును కాని గ్రంథమెల్లను శ్రీనాథాదులగు ప్రాచీను లెవ్వరయిన వ్రాసియుందురని తోచవలసిన యవసరము లేదు.

6. శ్రీనాథుడు పరమభాగవతోత్తముడట. నైష్టికుడట ఇట్టి గ్రంథమును వ్రాసివుండడట. యాత్రకొరకు వచ్చెడి సకలజాతుల నాతులను