పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నెంతమాత్రముం బోలదు. శ్రీనాథుని గడుసుతనపుపోకడ లిందెక్కడను గానరావు. అదియునుంగాక యీగ్రంథ మాధునికుఁ డెవ్వఁడో రచియించెనని స్పష్టముగ చెప్పుటకు తగిన యుదాహరణములు కొన్ని కానఁబడుచున్నవి. పదునేనవపద్యమునందు "తయారులోనే తగు" నను పదమున్నది. తయారన్నది తురకమాట కాని తెలుఁగుమాట కాదు. ప్రాచీనకవు లెవ్వరును ముఖ్యముగ శ్రీనాథుడు నిట్టిపదముల బ్రయోగించినట్లు లేదు. ఇట్లే నలంబదిమూడవ పద్యమున 'ఖయిదు బాహుపాశములఁ గట్టవే' అని యున్నది. ఇదియును శ్రీనాథాది ప్రాచీనులు ప్రయోగింపని హిందూస్తానీ పదమే. పంతొమ్మిదవపద్యమునందు 'నాకుంగూడ నాభాగ్య మెట్టుల నేనాఁటికి గల్గునో' యని యున్నది. 'నాకుంగూడ' ఇట్టి ప్రయోగము లాధునికుల గ్రంథములలోనే గాని ప్రాచీనుల గ్రంథమునందుఁ గానఁబడవు. ఇందు 'గూడ' యను పదము సముచ్చమార్ధమగు 'ను' వర్ణకమునకు బదులుగ నాధునికులు ప్రయోగించుచున్నారు. ముప్పదినాలుగవపద్యములో 'లజ్జిలినానఁట' యని యున్నది, 'లజ్జిలినాఁడ' నని యుండవయును గాని నాను యుండుట యసాధువు. ఇట్లు శ్రీనాథుడు ప్రయోగింపడు. ఈ పుస్తకము నందలి యేఁబది పద్యములలో నిటిటీ వింకం గొన్ని యున్నవి. గ్రంథవిస్తరణభీతిచేతి నిచట నుదాహరింపక యుంటిమి. పూర్వోదాహృతము లయిన ప్రయోగములంబట్టి చూడ నీగ్రంథ మెవఁడో నవీనుఁడు రచించియుండవచ్చునుఁ గాని శ్రీనాథాదులగు ప్రాచీను లెవ్వరును రచించియుండరనిసయితము తోఁచుమన్నది. సెట్టి లక్ష్మీనరసింహము గారు వ్రాసిన పీఠికలో శృంగార మన్న విషప్రాయముగఁ జూడవలయునని చెప్పు నిప్పటి యాంధ్రులకు శృంగారభూయిష్టమగు నీపుస్తకము రుచింపమి వివేకమే యని యొకచోటను, దీనిని నవీనకవియే యొకఁడు వచియించి ప్రచురించినచో విమర్శకు లెట్లు దూషించియుందురో దేవునికే తెలియునని వేరొకచోటను వ్రాసిరి. ఈనాటి యాంధ్రులలో నెవ్వరు శృంగారమన్న విషప్రాయముగ జూచుటలేదు. శృంగారము పేరు పెట్టి యిచ్చవచ్చిన పచ్చిబూతులు వ్రాసిన వారి కబ్బముల నీనాటివారు విషప్రాయములుగ జూచుచున్నమాట నిశ్చయమే. శృంగారరసమునకు నాగరికులు జదువ సిగ్గువడు మృదువు దప్పిన వాక్యమునకు భేదము తెలిసికొనలేక యీ లక్ష్మీనరసింహముగా రిట్టి వెఱ్ఱివ్రాతలు వ్రాసినందుకు మేము తద్దయు విచారించుచున్నారము. కాళిదాసాదులగు సంస్కృతకవులు కవిత్రయమువారు పింగళి సూరన్న మొదలగు తెలుఁగుకవులు శృంగారరసము వర్ణింపలేదా? ఆశృంగారరసము నీనాటి యాంధ్రు లాదరించుకులేదా? పురుషులయినం జదివి తలవంచుకొనవలసిన బండబూతుగల పద్యము లోని రసము శృంగారరసము గానేరదు. ఇట్టి గ్రంథముల నాదరించుట నాంధ్రభూమిలో విషవృక్షములం బెంచుట, ప్రాచీనులు రచియించి