పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యుండవచ్చును. అంతియేకాని కమలనాభామాత్యపౌత్రుడు, మారయామాత్య పుత్రుడు నగు మహాకవి శ్రీనాథుఁ డీగ్రంథకర్త కాఁడు. అదిగాక శ్రీనాథుని గ్రంథము లన్నిటినుండి తన లక్షణగ్రంథమునకు లక్ష్యపద్యములను దీసికొనిన యప్పకవి గాని కూచిమంచి తిమ్మనామాత్యుఁడు గాని యడిదము సూరకవి గాని మఱి యితరలాక్షణికు లెవ్వరు గాని యీగ్రంథము పే రయినఁ దలపెట్టకుండుటకుఁ గారణ మేమి? ప్రాచీనమహాకవుల కెవ్వరికిం దెలియని యీగ్రంథము నేఁడు కొత్తగా శ్రీనాథునిదని యొకరు చెప్పినంతమాత్రమున జను లొప్పుకొనవచ్చునా?

ఆకారణముల నటుండనిచ్చి ఇందు వర్ణింపఁబడిన యంశమును విచారింతము. ఒకరసికుడు వివాహితయయి భర్తతోఁ గాపురము చేయుచున్న యొకకులకాంతను మోహించి నఖశిఖపర్యంత మామె సకలావయవముల వర్ణించి ఆమెతో గూడినట్లు స్వప్నములఁ గాంచి యాస్వప్నములఁ దలంచుకొనుచు విరహతాపము నొందుచు నామెచక్కఁదనము దలంచి యూట లూరుచుండుటయే యిందలి కథాంశము. పరకాంత, కన్యయైనఁ గాదు. వేరొకనిభార్యయగు దానిని వలచి, వలచినందులకు సిగ్గుపడక పైపెచ్చు బూతుపద్యముల వ్రాసి శ్రీనాథుఁడు విరహతాపము పొందెనని చెప్పుట పరమభాగవతోత్తముఁడు నైష్ణికుఁడు నగు శ్రీనాథునికీర్తి పాడుచేయుట, శ్రీనాథునకే గాదు, ఈపద్యములు తనవని యెవఁడు చెప్పుకొనునో వాని కప్రతిష్టయే గాని ప్రతిష్ట కాదు. అందుచేతనే కవి గ్రంథమునందు మొదటనైన జివరనైన తనపేరు విస్పష్టముగ వేసికొనుటకు సిగ్గుపడియెను. మఱియుఁ జక్రబంధమునందున్న శ్రంగార శ్రీనాథపదములు కేవల మొకపురుషనామమును దెలియఁజేయవు. శృంగారశ్రీ యనగా శృంగారలక్ష్మి. దానికి నాథుఁడు శృంగారశ్రీనాథుఁడు. గ్రంధము దుర్నీతిభోధక మగుటచేతనో మఱియెందుచేతనో కవి గద్య వేసికొనుట మానినప్పుడు తన పేరు వేరువిధముగాఁ దెలియఁజేసికొనుట కిష్టపడునా? ఇష్టపడకపోవుటచేతనే తా నొకశృంగారనాయకుఁడ ననుమానము మాత్రము సూచించెను. అందుచేత నది యొక మనుష్యుని పేరుగా గ్రహించుటకు వీలులేదు. శ్రీనాథునకుఁ గవిసార్వభౌమ బిరుద మున్న దనియు నాపద మిందుఁ బ్రయోగింపఁబడుటచే నతఁడే దీనిని రచియించెననియుఁ బీఠికలో వ్రాయబడినది. కవిసార్వభౌమ బిరుద మనేకులకు గలఁదు. కూచిమంచి తిమ్మనామాత్యునకు లేదా? ప్రతికవియు నాలుగుపద్యము లల్లినతోడనే తాను కవీశ్వరుఁడ ననియుఁ గవిసార్వభౌముఁడ ననియు బుస్తకములలో బ్రయోగించుకొనుచుండును. కావున కర్తృత్వము శ్రీనాథున కారోపించుట కది యొకకారణము గాదు.

ఇందు పద్యములశైలియుఁ గవిత్వచాతుర్యము నించుక శోధించిచూతము. కల్పన లెక్కడనోగాని తరచుగాఁ బ్రౌఢముగా లేవు. శైలియు శ్రీనాథుని శైలితో