పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

 సరసుఁడవయ్యు నన్ను వెతసల్సఁగఁ జెల్లునె! చిన్నదాన నే
మెఱుఁగను సిగ్గుదీయ, కవి యెన్నివిధంబుల పాటపాడినన్,
మఱిమఱి ముట్టడించెదవు మామకచిత్తము నీదుమాటలం
గరఁగునొ! నీదు పుణ్యమగుఁగాని, ననున్ విడుమయ్య జారుఁడా.

53


చ.

ఎవరిఁక నిన్ను నమ్మఁగల? రింటికి నింటికి మ్రుగ్గువెట్టినా
వవసర మంతయుం గడచి నంతటనే సుడిపెట్టినాఁడ; నె
ల్లవిభులు నూతనప్రియు లిలాస్థలి న న్నటులే చరించుచుం
టి వవుర! నీదు చెల్మికిని నీకును దండము జారశేఖరా.

54


మ.

ఒకరా, యిద్దఱ, ముగ్గురా, మొదట నెంతో నీవు నమ్మించి గొం
తుకలంగోసిన యాఁడువారు? పదులున్ నూర్లుంగదా? వారు చా
లక, న న్గోతిని ద్రోయ నెంచితివొ? బేలంగాను, నామోహ మా
పుకొనం జూతునుగాని, యెన్నఁడును నీపొత్తొల్ల జారాగ్రణీ.

55


శా.

నీపైనే తమయాశ లెల్లగల కన్నెల్ వేనవేలో ప్రియా!
ఆపై నేనిఁక నేల? మీ చెలిమి కే నడ్డంబుగా వచ్చినన్,
పాపంబబ్బును, వారలన్ వదలి, నాపైనే తమిన్ నిల్పి, న
న్నే పాలింపుమనంగ న్యాయమగునా? నీవైనఁ బాలింతువా?

56


చ.

విభుడ ననున్ వరించుమును వి న్మొకసంగతి, యిప్పుడున్నయీ
రభసము తగ్గినంతటనె రాకెడపెట్టితివేని, న్యాయపున్
సభలకు నెక్కి నేఁదగవు సల్పకమానను నిశ్చయంబుగా,
ఉభయుల మప్రతిష్ట పడకుండెడు మార్గము చూడు మిప్పుడే.

57


శా.

న్యాయంబైన తెఱంగు నేఁ దెలిపెదన్, నా కీవు నీమానసం
బీయన్ వచ్చును, మానవచ్చు నది నీ యిష్టంబె యౌఁ, గాని వి
న్మా, యాదిన్ మనసిచ్చి, యావెనుక మానంబోవ, నే నొప్పుకో
నోయీ నాయక, చక్కగా మొదటనే యూహించి నన్ గోరుమా.

58