పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

కంటిని కన్నుల కఱవు దీఱఁగ, సుమ
            శరు ధిక్కరించు నీ చక్కదనము
వింటిని రతిశాస్త్ర వివిధరహస్యంబు
            లెఱింగిన నెఱజాణ వీవ యనుచు
అంటిని "కరుణామయా, నీకు నే దక్కి
            తిని, నీవె నాకిక దిక్క"టంచు
ఉంటిని, "నీకృప యొకనాడు గాకున్న,
            నొకనాఁటికైన నాకొదవు” ననుచు,


గీ.

వింటిని శరాళి సంధించి విషమబాణు
డొంటిని జురుక్కునం గొట్టుచుండె, వాలు
గంటి, నిదే కేలుమోడ్చి నేగతుల వేఁడు
కొంటిని, గవుంగిటంగప్పు కోడెగాఁడ.

43


ఆ.

నిన్నుఁ గన్న మొదలు నిముసమున్ మగనితో
ఱంకుతన మొనర్ప జంకుపుట్టె
నన్నుఁ జెట్టపట్టి నాదుపాతివ్రత్య
విధిని నిలుపు మయ్య విటవరేణ్య.

44


ఉ.

హేయపుమాట లన్యులన నీ, కులబంధువు లెల్లరున్ వెలిన్
వేయగనీ, చెలుల్ విడువనీ, పతి మున్నగువార లల్లరుల్
చేయగనీ, భయంపడను. చిత్తము నీకయి దాచియుంచినా
నోయిమగండ, వేరు మనముందము రమ్ము యథేచ్చగా నికన్.

45


ఉ.

సామి, యి దేమిపాప! మొకజాబునకైన జవాబు వ్రాయ వే
మీ! మృదులాంగుళంబులకు మిక్కిలి కష్టమటంచు వ్రాయ లే
దేమొ! యిదొక్కకష్టమని యింతభయంపడుచున్న నాయుర
స్పీమను జందనద్రవము చిక్కగ రాయుట కేమి యందువో?

46