పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శా.

నీసౌందర్యము కాంచి యాశ వడితిన్ నీచిత్త మేతీరొ నీ
మీసం బట్లు ప్రసన్నమై తనరునో? యారీతిగాఁ గాక, నీ
మీసం బట్టులు వక్రమో యెఱుఁగ; నీమీసాలలో నవ్వులున్
నాసందేహము వృద్ధిచేసె; నది మాన్పం జిత్త మిమ్మాప్రియా.

25


ఉ.

నాయక, నీవు నన్ వలచినాఁడ వటంచును నాకుఁ దెల్పఁగా
నే, యొడలెల్ల జల్లుమనియెన్, వలిగాలికి తీవకైవడిన్;
కాయము దాల్చినందులకుఁ గల్గె నదృష్టము నేఁటి: కింక నా
ప్ర్రాయము ధన్యమయ్యె; నిటుపై మఱి యే దెటు లైననున్ సరే.

26


ఉ.

ఎన్నఁడు నీకు మోహ ముదయించునొ నాపయినంచు నుండగా
ఇన్నిదినాల కద్ది లభియించెను కాంతల ప్రాయమన్ననో
క్రొన్ననవంటి దోయి 'యిదిగో' యన నాఱునెలల్ గతింపకుం
డ, న్నను ధన్యురాలిఁగ నొనర్పఁగ రాఁగదవోయి నాయకా.

27


ఉ.

కోకలు గోర, రూకలును గోరను, సొమ్ముల బెట్టఁగోర, నే
శోకము గోర నీకరుణ సోకుటయే పదివేలు నాకు, నీ
రాకనె కోరుచుండెదను రాకను జెందొవ గోరుమాడ్కి న
ఱ్రాకలు నన్ను బెట్టకుమురా. కలకాలము నేలరా కృపన్.

28


చ.

తనప్రియుఁ గూడకుండ వసుధం గులకాంతకు నత్త యంచు. మా
మని, మఱియాడుబిడ్డలని యడ్డులు గంగకు నొడ్డులట్లుగా
కని కనినాదు కాఁపురము గంగను దింప తెగింపు పుట్టెను, గం
గను శివుఁ డేలుకొన్నటులుగా నను నేలెద వన్నచో ప్రియా.

29


చ.

పురుషవరేణ్య! స్వాతికయి ముత్తెపుఁజిప్పలరీతి నాకనుల్
త్వరపడుచుండె తావకవిలాసము కన్గొన స్వాతిబిందువుల్,
కురిసినగాని ముత్తియపు కోవ జనింపదు శుక్తులందు ని
న్నరయనికాలమందె యుదయంబగు నాకనులయందు ముత్యముల్.

30