పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

జలజదళాయతాక్షి సరసంబునకుం బొలయల్కయుండఁగా
వలయునటంచు నల్గితివొ? వ్యర్థపుఁగోపము తెచ్చుకొంచు, నీ
వులుకకపల్క కీకరణి యూరకయుండుటనీతికాదు, నన్
పిలిచి, యథాప్రకారముగఁ బ్రేమనుగౌఁగిటఁ జేర్చుకోఁగదే.

97


ఉ.

ఇంకొక కామినిన్ మరిగి యిప్పుడు పోవుచునుంటినటంచు నో
పంకజనేత్రి యట్టియపవాదమునాపయి మోఁపెదేల? యి
ఱ్ఱింకులుగొన్న మోహమున నిప్పుడెకా, దిఁక నెప్పుడున్ భవత్
కింకరుఁడన్, మఱింకఁ దొలఁగించుకొనంగదె నీదుశంకలన్.

98


శా.

ఏయాటంకము లెన్ని కల్గినను నిన్నే నేను, నన్నీవు కాం
తా! యిన్నాళ్ళును నాశ్రయించుకొని యున్నా, మింతొ యంతో సుఖం
బే యెల్లప్పుడుఁ బొందినారము గదా! యిట్లున్న యన్నాళ్ళునున్
హాయింగూర్పఁగ నిన్ను వేడుకొనెదన్, దైవంబు, బ్రార్ధించెదన్.

99


మంగళం బగుఁగాక మానీనీ తారకా
            సఖములౌ తావకనఖములకును!
మంగళం బగుఁగాక మగువ, చక్రప్రతి
            బింబమౌ నీదునితంబునకు!
మంగళం బగుఁగాక మహిళామణీ, కోక
            రాజములౌ నీయురోజములకు
మంగళం బగుఁగాక మదిరాక్షి శశికళా
            సదనమౌ భవదీయ వదనమునకు!


గీ.

మధుపుక్రోవియౌ మోవికి మంగళంబు
మల్లెపువులగు నవులకు మంగళంబు!
మరులు గనులగు కనులకు మంగళంబు!
మధుకరులగు ముంగురులకు మంగళంబు!

ప్రథమభాగము సంపూర్ణము.