పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

చాన సువర్ణదానమును సల్పును నీదు శరీరకాంతి, భూ
దానము సల్పు నీ కటి, నదా తిలదానము సల్పు నాస, యౌ
రా! నిరతాన్నదాన మమరాళికి సల్పును నీదు మోవియున్,
నే నిను నీవి వేఁడితిని నీవిక లే దనఁ బోకొసంగుమా.

17


చ.

రజమును దాల్చు పుష్పనికరంబును, చెమ్మను బూను పల్లవ
వ్ర్రజమును, తేజముం గల సువర్ణము, గాలికి నూఁగు తీఁగ ల
భ్రజనితమైన క్రొమ్మెఱుఁగుపంక్తియు నీ తనువందుఁ గూర్చి ని
న్నజుఁడటు పంచభూతనిచయంబువఁ సృజీయంచెఁ గోమలీ.

18


ఉ.

తేనె యనంటిపండ్లఁ గల తీయఁదనంబల దొండ్లపండ్లలోఁ
గానఁగ వచ్చునేని, యటుగాక యనంటికి దొండపండ్ల కెం
పైనను గల్గెనేని, సరియౌ ననవచ్చును నీదు మోవికిన్,
మానిని! నీ బెడంగు లసమానములై విలసిల్లు సృష్టిలో.

19


ఉ.

తామరతూండ్లటంచును, లతాయుగమంచును, బువ్వుదండలం,
చీ మెయి నీదు బాహువుల నెన్నుదు రన్నివిధాల నందఱున్,
కాముఁడు వీడకుండ నను గట్టిగఁ గట్టిన మోహపాశము
ల్గా మది నేఁ దనంచెనను గామిని, గంధగజేంద్రగామనీ.

20


చ.

ఇలపయి నీదు కౌను గుఱియించి వివాదము లుద్భవిల్లఁగా,
కలదని, మింటికీం బయిని గ్రాలు నటంచును గొందఱాస్తికుల్
పలుకుదు రద్ది కేవల మబద్ధ, మొకింతయుఁ గౌను నీకుఁ దొ
య్యలి, సహి, లేదు, లేదనుచు నాస్తికవాదము లిను సల్పెదన్.

21


చ.

మదనునిదంతి వేటకు సమంబుగ నీనడ లేన్లు నెన్నడల్
గద, తొడ లేన్గుతుండములె, గండరుచుల్ కరిదంతతుల్యముల్
గద, మరి యొక్కసామ్యమును గద్దది చెప్పితినేని, నీకు సి
గ్గొదవునటంచు జంకుమెయి నూరకయుందుఁ జకోరలోచనా.

22