పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఎల్లీ మల్లీ వల్లీ
పుల్లీ మా రాజు కూసుపోవక మీమీ
గొల్లెనకై రాఁడు గదా
కల్లలు వల దింకఁ జెప్పగదరే వేగన్‌.

9


సుగంధి.

నేలఱేఁడులార మంచినేస్తులార విక్రమా
భీలశూరులార పిన్నపెద్దలార గుప్పునన్‌
బూలపాన్పు డిగ్గి యేడఁ బోయినాఁడొ చూడరే
నీలకాశ్యపీవరుండు నిన్నరేయి యొక్కఁడున్‌.

10


మ.

అని గగ్గోలుగ వారు రోదనము సేయన్‌ నాయకుల్‌ గాయకుల్‌
చనవర్లున్‌ గణికాజనంబు లనుజుల్‌ సామంతులున్‌ మంత్రులున్‌
విని శోకాకులచిత్తు లై కదిసి తద్వృత్తాంత మాలించి యా
యన నన్వేషము సేయఁబోయిరి సమీపారణ్యమధ్యంబునన్‌.

11


క.

గట్టుల దరిఁ బుట్టల కడఁ
జెట్టుల చెంగటను జెఱువు చెంతల బలు పె
న్గుట్టల సందుల గొందులఁ
బట్టుగఁ బ్రవహించు నేటిపల్లములందున్‌.

12


క.

రోయుచు హో యని కూఁకలు
వేయుచు హా నీలభూప విస్మయముగ నీ
వేయెడ కేఁగితొ వెస రా
వే యనుచును మోఁదుకొనుచు విహ్వలు లగుచున్‌.

13


క.

మూఁగి యరయంగ నాతని
తోఁ గూడం జనిన వేఁటతోరపుఁగుక్కల్‌
సైగలు సేయుచు సాగఁగ
నా గతి గని చనిరి వార లందఱు వెంటన్‌.

14


క.

చని కనిరి చంద్రరేఖా
తనురూపవిలాసవహ్నిదగ్ధశరీరున్‌
ఘనచింతాభారున్‌ నూ
తనజనితదశావికారు తన్నృపమారున్‌.

15