పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చుచు, నలుదిక్కులు కలయం జూచుచు, నవ్వుచు “హా! నీలాద్రి నర
పాలపుంగవా! వచ్చితే!” యని లేచి “నా కుఱువుపయిం గూర్చుండు”
మనుచుఁ, బరిపరివిధంబుల మతిదప్పి, వెఱ్ఱిగొనిన వేఁపి తెరంగున,
నాలి సాలెపురువు చందంబున, మగ్గంబులో నాడెడి నాడెకైవడి,
మధుపానంబు చేసిన వానరంబుపోలిక, మావి కఱుచు నక్కటెక్కునఁ,
బిడుగు మొత్తిన జనునిచందంబున, మూఁగలాగున, ముల్లెపోయి
పొరలు ముండవిధంబున, ముక్కుచు, మూల్గుచు, ముఱికిపిత్తులు
పిత్తుచు, మూఁకుడువంటి మూత్రద్వారంబు మొగి విప్పుచు, ముడుచుచు,
మొగంబు దిగవైచుచు, మూర్ఛిల్లుచుఁ, దెలియుచు, మోహదాహాతి
తాపంబునం దల్లడిల్లుచుండె; నయ్యవసరంబున.

58


క.

వేంకటసాని కి దంతయుఁ
గింకరు లెఱిఁగింప, దుఃఖకీలితమతి యై
కొంకుచుఁ గూఁతురి నునుప
ర్యంకము చేరంగఁబోయి హా హా యనుచున్‌.

59


తే.

బిడ్డరో నీకు మునుపుండు నడ్డగరలు
పెక్కుమాఱులు తగిలిన స్రుక్కకీవె
మాన్పుకొంటివి యిటువంటి మమత నాఁడు
కలుగదయ్యెను వట్టి దుష్కర్మ మొదవె.

60


క.

ఆరయ నీలనృపాలుని
పేరును బెంపేమి? యతని పెద్దలు మున్నే
తీరున నుండిరి? యీ సిరి
వీరాగ్రణి విజయరామవిభుఁ డొసఁగెఁ గదా!

61


తే.

ఇంతెకాని, జమీందారుఁ డే యతండు?
పరమమూర్ఖుండు బహులోభి పాపచిత్తుఁ
డాత్మదాసీరతుఁడు వాని కాస చెంద
నిహపరసుఖంబు లేదు నీ దేటి వలపు?

62