పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కరివక్త్రునకు నతిఁ గావించి వాల్మీకి సాత్యవతేయుల సంస్మరించి
కాళిదాసాది సత్కవులను గొనియాడి గరిమతో నాంధ్ర సత్కవులఁ దలఁచి


గీ.

రాధికామాధవుల విహారంబు లన్ని పూని శృంగారశతకంబుఁ గా నొనర్తు
సరసులందరు విని చాల సంతసింపుఁ డనఘులారా! బ్రహ్మానంద మదియకాదె.


సీ.

గుణదోషములు వర్ణగణములు శబ్దార్థపద్ధతుల్ గని యతి ప్రాస బంధ
నియమంబు లెఱిఁగి యెన్నికకెక్కి మృదుమధురోక్తులుగదియించి యుక్తభంగి
నతివిపులార్ధంబు మితపదంబులలోనఁ దెలియించి ముద్దుమాటలను గూర్చి
[1]విరళార్ధ సంయొక్త సరళశబ్దంబులు పొసగఁ నలంకృతుల్ పొందు పరచి


గీ.

రసము చిలుకంగ [2]వాచక రౌచకాది సప్తవిధ సత్కవీంద్రుల జాడ లెఱిఁగి
శౌరి లీలావిలాసముల్ సన్నుతింతు నరసి చూడ బ్రహ్మానంద మదియకాదె.


సీ.

సచ్చిదానంద లక్షణ పరబ్రహ్మంబు మును విషయానంద మనుభవింప
దలఁచి తా గుణమయతనువుఁ గైకొని తనయోగమాయను రాధ గాగఁ జేసి;
పరగ బ్రహ్మాడంబు బయల క్రీడార్ధంబు గోలోకము సృజించి కోరి తనదు
కళలచే రాధికా కళలచే, గోపగోపికలను నిర్మించి నకళు డగుచు


గీ.

నందు గ్రీడించెఁ గానిచో నగులు, డేల మోహనకిశోరరూపంబుఁ బొసగ దాల్చె
నట్టి కృష్ణుని శృంగార మభినుతింతు నరసిచూడ బ్రహ్మానంద మదియ కాదె.


సీ.

ధరలోన మనుజు లందఱు మానుషానందమందు సదాశక్తులగుట వలన
తాను మానుషరూపధారియై తగ మానుషానందమును బ్రీతి ననుభవింప
కరమర్ధి తనదు శృంగారచారిత్ర ప్రపంచమంతయు నాలకించి చాల
మధురసాచ్ఛాదితౌషధముటికాన్యాయమున నిహపరసౌఖ్య మనుభవించి
ధన్యు లౌటకు మహా ధన్యుండు గోలోకవాసి యా కృష్ణుండు భాసురముగ


గీ.

కోరి బృందావనంబున గోకులంబునందు విహరింప, మధురలో నవతరించె
నట్టిశౌరి విలాసంబు నభినుతింతు నంచితముగ బ్రహ్మానంద మదియకాదె.


సీ.

కడువేడ్క దేవకీగర్భంబున జనించి ప్రాకృతబాలుని పగిది జాణ
వికసనంబులు లేక వెస బరాధీనుడై సర్వోపచారముల్ సంగ్రహించి
టరయ, నామాయ నా యంతవానికె యజ్ఞతయును బరాధీనతయును గలుగఁ
జేయు సామర్థ్యంబు చేనొప్పునట్టిద, యని యెఱింగించుట కంతేగాక

  1. సరసార్ధ
  2. మదిని సంతసము పొంగ సకల