పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


డాలోకకాలానలాభీలవిస్ఫుర
            న్నేత్రుండు ఖడ్గసన్నిభనిశాత


గీ.

నఖరుఁడు హిరణ్యకశిపువినాశకుండు
సింహగిరివర్తి యగు నరసింహమూర్తి
యడరు చింతలపాటి నీలాద్రినృపుని
సిరియు గర్వం బడంగంగఁ జేయుఁగాత.

3


ఉ.

నీరదనీలవర్ణుఁడు శునీవరవాహుఁడు విద్యుదాభవి
స్ఫారజటాభరుండు బహుశష్పసమన్వితదీర్ఘమేఢ్రుఁ డం
భోరుహగర్భమస్తకవిభూషితహస్తసరోజుఁ డా మహా
భైరవుఁ డిచ్చుఁగాత నశుభంబులు నీలనృపాలమౌళికిన్‌.

4


చ.

అనుపమవిక్రమక్రమసహస్రభుజార్గళభాసమానసా
ధనజితసిద్ధసాధ్యసురదానవదక్షుఁడు దక్షశీర్షఖం
డను డగు వీరభద్రుఁడు గడంకను జింతలపాటి నీలభూ
జనపతిపుంగవు న్విభవసారవిహీనునిగా నొనర్చుతన్‌.

5


చ.

నలువగు రక్తమాల్యవసనంబులు డంబుగ దాల్చి కన్నులన్‌
జలజల బాష్పబిందువులు జాలుకొనంగఁ జెలంగుచుండు న
క్కలుములచేడె యక్క కలకాలము నీలనృపాలు నింటిలో
గలిపురుషానుషంగ యయి గాఢరతి న్నటియించుఁగావుతన్‌.

6


చ.

అనుదినవక్రమార్గగతు లై చరియించుచు వైరివర్గముల్‌
దనరఁ బరిస్పరాత్మతను దాలిచి మంగళుఁడు న్గురుండునన్‌
శనియును రాహువు న్మిగులసమ్మతి ద్వాదశజన్మరాసులన్‌
గొనకొని నిల్చి నీలనృపకుంజరుని న్గడతేర్తు రెంతయున్‌.

7


కం.

భీమకవి రామలింగని
స్త్రీమన్మధుఁడై చెలంగు శ్రీనాథకవిన్‌
రామకవి ముఖ్యులను ప్రో
ద్దామగతిం జిత్తవీథిఁ దలఁచి కడంగన్‌.

8


వ.

ఇట్లు సకలదేవతాప్రార్థనంబును సుకవిజనతాభివందనంబును
గావించి యే నొక్క హాస్యరసప్రధానమగు ప్రబంధంబు “సుకవి