సభ' ప్రచురణలు ఆరంభించితిని. ఇందుకు నాకు గల యోగ్యత ఉత్సాహము తప్ప మరేమీ లేదు. పాండిత్యమూ, ధనమూ కూడ నాదగ్గర లేవు గదా. ఇవి రెండూ పుష్కలంగా ఉన్న వారు యీ ఉద్యమాన్ని ఆరంభిస్తే మంచిదే. గతంలో యిట్టి యత్నము లనేకు లారంభించి, కొంత కృషి గావించి విరమించడం జరుగుతూ వచ్చింది. మరికొందరికి కూడ నా యీ చిన్నప్రయత్నంవల్ల ఉత్సాహం కలుగవచ్చునేమో? అని భావించాను.
ఆ ఊహ నిజమే ఐనది. మిత్రులు శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్యులు ఎం. ఏ. గారు తాము అనువదించిన 'పాతఞ్జలమహాభాష్యము' పస్పశాహ్నికమును రాజమండ్రి సంస్కృతప్రచారసభపక్షమున ద్వితీయకుసుమముగా ప్రచురించుటకు దయతో నంగీకరించుటే గాక దానికగు వ్యయమునంతను వారే భరించిరి. ఈ గ్రంథప్రశస్తి పండితైకవేద్యము. విపులమైన 'అభివాదము'ను వ్రాసిన శ్రీ వేదుల శ్రీరామచంద్రకీర్తి ఎం. ఏ. గారు సంస్కృతవ్యాకరణకర్తలలో మఖ్యులైన పాణిని, కాత్యాయనుడు, పతఞ్జలి — యీ మహర్షిత్రయముయొక్క అమూల్యకృషిని చక్కగా వివరించిది.
భాషాశాస్త్రజ్ఞులైన అనేకులు పాశ్చాత్యపండితులు వేనోళ్ళ కీర్తించిన సంస్కృతవ్యాకరణరచన ఎట్టిదో? అది మన తెలుగుపాఠకులకు రుచి చూపించగల్గినందుకు సంతోషించుచు, తగు ప్రోత్సాహ మున్నచో మరికొన్ని ప్రముఖశాస్త్రీయగ్రంథములను కూడ వెలుపర్చదలచి యున్నామని మనవి చేయుచున్నాము.
'సుభాషితములు' అను మూడవగ్రంథముకూడ త్వరలోనే ఆంధ్రపాఠకులకు అందీయగలమని తెలుపుటకు సంతోషముగ నున్నవి. సంస్కృతసాహిత్యములో కొల్లలుగ నున్నవీ, మనోహరములూ, అర్థవంతములు, గంభీరములూ ఐన వాటిని వేయింటిని ఎంచితీసి, తెనుగు తాత్పర్యముతో ప్రచురించితిమి. వాటిలో ఒక్కొక్కదానిని తీసి, రోజు కొకటిగా విద్యాలయ ప్రవేశద్వారమున ప్రముఖముగ గోడపైన గాని, నల్లబల్ల పైన గాని వ్రాసి, విద్యార్థులు చదువునట్లు ప్రదర్శించుచో సత్ఫలితములు కలుగునని మనవి.
'ప్రాచీనభారతనీతి' యనుదానిని మా నాల్గవగ్రంథముగా వెలువర్చ నిర్ణయించితిమి. శుక్రనీతి, భీష్మనీతి, చాణక్యనీతి, కామందకనీతి, విష్ణుశర్మ పంచతంత్రము, క్షేమేంద్రుడు, సోమదేవుడు, కాశ్మీరకవి గుమానీ, యితరులు కొందరూ వచించిన రాజనీతిబోధనలను తెలుగు తాత్పర్యమూ, వ్యాఖ్యానముతో ప్రచురించుటకు నిశ్చయించితిని. అవకాశములను బట్టి మరెన్నో ఉత్తమగ్రంథములు ప్రచురణకు సిద్ధముగా ఉన్నాయి.