పుట:పాండురంగమహాత్మ్యము.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

పాండురంగమహాత్మ్యము


సీ.

జగతి సొబగుల నెన్నఁగఁ గావ్యధారల
        ఘనుఁడ వాశువునందుఁ గరము మేటి
వఖిలభూమిపాలకాస్థానకమలాక
        రోదయతరుణసూర్యోదయుఁడవు
శైవ వైష్ణవ పురాణావళీనానార్థ
        రచనాపటిష్ఠైకగమ్యమతిని
లౌకికవైదికలక్షణచాతుర్య
        ధైర్యప్రభారూఢకార్యచణుఁడ


గీ.

వరయ భూమికుచాగ్రహారాభమైన
శ్రీతెనాల్యగ్రహారనిర్ణేత వగ్ర
శాఖికాకోకిలమ నీవు సరసకవివి
రమ్యగుణకృష్ణ రామయ రామకృష్ణ.

23


క.

కౌండిన్యసగోత్రుఁడ వా
ఖండలగురునిభుఁడ వఖిలకావ్యరససుధా
మండనకుండలుఁడవు భూ
మండలవినుతుఁడవు లక్ష్మమావరతనయా!

24


క.

యశము గలిగించు నీమృదు
విశదోక్తులఁ బౌండరీక, విభుచరితఁజతు
ర్దశభువనవినుతముగ శుభ
వశమతి నా పేరనుడువు వరతత్వనిధీ.

25


ఉ.

స్కందపురాణనీరనిధి కౌస్తుభమై ప్రభవించు దేవకీ
నందనుసత్కథోద్యమము నవ్యకవిత్వకళాకలాపమన్
కుందనమున్ ఘటించి కడుఁ గ్రొత్తగు సొమ్మొనరించి విష్ణుసే
వందిలకించు నప్పరమవైష్ణవకోటి నలంకరింపుమా.

26