పుట:పాండురంగమహాత్మ్యము.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

7


క.

ఠవణింతు నొక్క శ్రీభా
గవనచరిత్రంబుఁ బరమకల్యాణసము
ద్భవభవనంబుఁ జతుర్దశ
భువనమహారత్న సూత్రముగఁ దగుసరణిన్.

18


వ.

అని యిట్లభినవ ప్రబంధనిర్మాణ కౌతూహలాయత్తచిత్తుండ
నయి యేనున్న సమయంబున.

19


సీ.

తనకులాచారవర్తన వైష్ణవాచార
        పర్యాయముల కొజ్జబంతి యనఁగఁ
దనసూనృతము పురాతనసత్యనిధులయు
        న్నతికిఁ బునఃప్రతిష్ఠితము గాఁగఁ
దనబుద్ధి నీతీశాస్త్రరహస్యములు తెల్ల
        ముగఁ దెల్పువ్యాఖ్యానముద్ర గాఁగఁ
దనవ్రాయు గంటంబు మొనవాఁడి విశ్వంభ
        రాప్రజలకుఁ బ్రాణరక్ష గాఁగ


తే.

వెలయు మంగయ గురువభూవిభుని పెద్ద
సంగభూపాలమణి రాయసప్రవృత్తి
సఖయుతుండైన రామానుజయ్యసుతుఁడు
భద్రగుణసీరి విరూరి వేదాద్రిశౌరి.

20


మ.

కవులుం బాదకులున్ బ్రధానులు నలంకారజ్ఞులున్ బ్రాజ్ఞులున్
ధవళాక్షు ల్భజియింప నిండుకొలువై తారేందుతారావళీ
ధవళంబైనసువర్ణకుంభయుతసౌధంబందు నావాసమై
వివిధామ్నాయపురాణగుంభనకథ ల్వించున్ బ్రమోదంబునన్.

21


క.

నను రామకృష్ణకవిఁ గవి
జనసహకారావళీవసంతోత్సవసూ
క్తినిధి బిలిపించి యర్హా
సనమునఁ గూర్చుండఁబనిచి చతురత ననియెన్.

22