పుట:పండితారాధ్యచరిత్ర.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉపోద్ఘాతము

127

వెయ్యినూటపదకొండుపదములు గా రచించినాడు. దాని నిత డిరవైయైదు “గతులు" గా అయిదాశ్వాసములలో రచించినాడు. చామరసు పదిహేనోశతాబ్దమువాడు. అతని కావ్యము భామినీషట్పదములలో వ్రాయబడినది. సోమన గ్రంథము — ప్రథమాశ్వాసములో : (1) భక్తనమస్కారము, గురుస్తుతి; (2) కైలాసవర్ణనము; (3) మాయాజవనము; (4) గురుస్తుతి; (5) అల్లమమాయనాడించుట; అనే అయిదుగతులున్ను;

రెండో ఆశ్వాసములో (1) విమలాగమము (2) ప్రభు వదృశ్యుడగుట (3) మాయ పార్వతియొద్దకుఁ బోవుట (4) ప్రమథాగమము (2) అక్కమదేవి అనే అయిదుగతులున్ను,

మూడో ఆశ్వాసములో (1) గొగ్గయ్య (2) ముక్తాయి (3) సిద్ధరామయ్య (4) ప్రభువు కల్యాణమునకు వచ్చుట (5) మరుళశంకరుడు అనే అయిదుగతులున్ను,

నాలుగో ఆశ్వాసములో (1) ఇష్టలింగము (2) అక్కమహాదేవి (3) ప్రాణలింగము (4) గోరక్షుఁడు (5) ప్రభువు మునుల కుపదేశ మిచ్చుట అనే అయిదుగతులున్ను

అయిదో ఆశ్వాసములో (1) శూన్యసింహాసనమును గట్టుట (2) ప్రభువు శూన్యసింహాసన మెక్కుట (3) ఆరగింపు (4) భావలింగము (5) వీరశైలమహిమ అనే అయిదుగతులున్ను మొత్త మిరవైఅయిదు గతు లున్నవి.

కాంచీనగరములో ‘ధర్మద్రావిళ' అనే బిరుదముతో ధర్మవాణిజ్యము చేసే నెల్లూరి రామలింగయ్య ప్రేరణచేత సోమన ఈ గ్రంథమును రచించి తనగురువైన సిద్ధవీరేశ్వరుని కంకితము చేసినాడు. ఈ సిద్ధవీరేశ్వరగురువు రామలింగయ్యకును, అతనితల్లి తిరువమ్మకును,