పుట:పంచతంత్రి (భానుకవి).pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అట్లు గావున నాప్రజ్ఞాబలమున నెఱింగితి ననం గరటకుం డతని
నిరీక్షించి రాజు నుపాసించు సమయ మెఱుంగఁజేయు మన దమనకుం
డిట్లనియె.

81


క.

కోపప్రసాదగుణములు
భూపాలునియందుఁ దెలిసి బుద్ధి నధికుఁడై
చాపలవిరహితహృదయుం
డై పెంపునఁ గొలువ, నధికుఁడగు సేవకుఁడున్.

82


గీ.

అనినఁ గరటకుఁ డిట్లను ననవసరము
నందు మున్నొక్కనాడు నీవరుగ విభుఁడు
మిగుల విలపించె నీవేళఁ దగుఁ జనవునఁ
బోవ, ననవుడు నాతండు బుద్ధిబలికె.

83


వ.

ఎవ్విధంబుననైన నుపజీవులకుఁ బరివృఢసేవ విడువవచ్చునే యని
దమనకుండు వెండియు నిట్లనియె.

84


క.

పతి, యంగనాంగసంగ
స్థితిఁ దాఁ జేపట్టినట్లు చెనఁటులనైనన్
సతతమ్ము డాసి కొల్చిన
నతికరుణను బ్రోచు, వారి నవనీపతియున్.

85


వ.

అని చెప్పిన గరటకుండు దమనకుతో నీవు పతిసన్నిధికిం జని
యచ్చట నతనిచిత్తమ్ము వచ్చునట్లుగా నెవ్విధంబుగఁ బలికెదవనిన నతం
డతని కిట్లనియె.

86


క.

ఒరులాడిన వాక్యమ్ముల
సరవిం బ్రతివాక్యములు రసస్థితి వొడమున్
ధరణిని బీజమ్ములు దా
మురు వృష్టిని బొడముకరణి నుచిత మ్మగుచున్.

87


క.

గురువైనసు [భటుఁడైనను]
బరిభవమును బొందు మనుజపాలకుచేతన్
సరసత్వము సమయోచిత
మురువాచాప్రియము నెఱుఁగకున్నను ధరణిన్.

88