పుట:నృసింహపురాణము.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94

నృసింహపురాణము


క.

దైతేయరాజ్యవిభవ, ఖ్యాతి యెసఁగ నీవు పెద్దకాలము భవభో
గాతిశయము నాసక్తుఁడ, వై తగ భుజియించి పొందు మస్మత్పదమున్.

119


క.

నాయెడ నసూయ చేసె, న్మీయయ్య యనంగ వలదు నిజ మతఁడును దో
షాయత్తుఁడు గాఁడు తుదిన్, జేయుదు నతనికిని బరమసిద్ధి కుమారా!

120


ఉ.

ఈవనరాసు లీకులమహీధరసప్తక మీరవీందుతా
రావిభవంబు లీగగన మీదిశ లుండెడునంతకాలమున్
గోవిదకీర్తనోల్లసితఘోషణ మై భవదాత్మభక్తిస
ద్భాగవివేకపాకజనితం బగుపేర్మి ప్రసిద్ధి నొందెడున్.

121


వ.

అని ప్రహ్లాదుం డాహ్లాదంబు నొందకృపామధురవచనంబు లుపచరించుచున్న య
ప్పరమాత్ముపరమవాత్సల్యవైభవంబునకుం బొంగి మహామునులును ననిమిషులును జయ
జయశబ్దంబుల నద్దేవు నభినందించిరి. తదనంకరంబ యయ్యందఱఁ బ్రసాదదృష్టి
నాలోకించి యజ్జగదీశ్వరుం డిట్లనియె. ఈమహనీయస్థానంబు పరమమంగళంబై
నన్నుం దనయందు నునుపంగోరుచున్నయది. నాహృదయంబునం జూడ్కులు నిం
డం బ్రియంబు నొందెం గావున నిమ్మహాశైలంబునంద యుండంగలవాఁడ. మీరు మదీ
యబలం బహోబలశబ్దపూర్వకంగా బ్రశంసించితిరి గావున నీతీర్థం బహోబల
నాయధేయంబునఁ ద్రిభువనపావనంబై వెలయుంగాత. నా చేతి నధిరూఢంబైన యి
గ్గిరియును గరుడాద్రి యనం బ్రఖ్యాతి వహించునని యానతిచ్చె. నప్పు డగ్రభా
గంబున.

122


ఉ.

శ్రీకమనీయమూర్తి నరసింహపదాంబుజసేవ గోరి మం
దాకిని ధాత్రిమీఁది కవతార మొనర్చి నిజాంగలీల న
స్తోకతరంగసంగములతో సమదాలిమనోజ్ఞపంకజో
త్సేకముతో లసచ్చిశిరసేకమనోజ్ఞమహోత్సవంబుతోన్.

123


వ.

అమ్మహానది కొలువు గైకొనియె. నా దేవుండు భవనాశినీసమాహ్వయం బని యభినం
దించె. నింద్రాదిసురలును ప్రహ్లాదప్రముఖులును కొనియాడిరి. తదనంతరంబ తత్ప్రదే
శంబున బున్నాగ నాగకేసర సరళ రసాలతాల హింతాల తమాల నారికేళ నారంగ
మాతులుంగ లవంగ లికుచ క్రముక కుటజ నిదుల చందన చంపక వకుళ కురువకా
శోక శమ్యాక శమీక మధూక మాధవీతిలక తింత్రిణీ నింబ జంబూ జంబీర పనస
హరిభద్ర భద్ర దారు దాడిమీ సుమనోమల్లికా మరువక తులసీ ప్రముఖవివిధతరుల
తాలంకృతంబును నిరంతరవసంతవాసభవనంబును నగువనంబునం దుండి.

124


సీ.

నిండారుచందురు నెరసుఁ గొండొకజేసి మిగులఁ జెన్నొందిననగుమొగంబు
వెలిదమ్మిరేకులచెలువు మాయించి యుగ్గడువుగ బెలసినకన్నుగవయుఁ
గనకకుంభములఁ జుల్కలు చేసి యెంతయుఁ గ్రొవ్వాడి వ్రేఁగైనకుచయుగంబుఁ
గెందలిరాకులయందంబు వెసఁ జించి రంజిల్ల మెరయుకరద్వయంబుఁ