పుట:నృసింహపురాణము.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

87


మ.

జననం బొందుననంగరా దజుఁడు నా శక్యంబుగా దబ్ధియం
దనిశంబున్ బవడించునా నిజముగా దత్యంతబద్ధుండునాఁ
జన దేకాంతతపస్వినాఁ జనదు శశ్వత్క్రోధినాఁ బోల దే
మని వర్ణింతును వారిజోదరుని యత్యాశ్చర్యచారిత్రముల్.

70


క.

ఆలించు నార్తరవ ము, న్మూలించును ఖలు సతతమున్ సజ్జనులం
బాలించును గృప నెంతయు, శీలించును మత్ప్రభుండు శ్రీవిభుఁ డాత్మన్.

71


మ.

ఒకకేలన్ విలసత్సుదర్శనము వేఱొంటం బరిస్ఫారనం
దకమున్ బ్రస్ఫురితాన్యహస్తమున నుద్యత్పాంచజన్యంబు నొం
డొకటన్ శార్ఙ్గము దాల్చి ధర్మరిపుల న్ఘోరాజీ మర్దింపుచున్
సకలైకాశ్రయమూర్తితోడ నెపుడున్ వర్తించు నాముందటన్.

72


వ.

అనుచు ననేకవిధంబులఁ బ్రహ్లాదుండు విజ్ఞానపరవశుండై పలుకుచున్నపలుకు లప
హసించి యసురేశ్వరుండు.73
క. తొలిమేనికర్మవశమున, బలవంతపువెఱ్ఱిబిట్టు బట్టిన నేభం
గుల నోరు మూనేరక , పలుదెఱఁగులఁ బ్రేలె దీవు ప్రాజ్ఞులు దెగడన్.

74


వ.

ఇంక నున్మత్తుతోడిమాటలఁ బ్రయోజనంబు గలదె యనిన నమ్మహానుభావుం డమ్మో
హాంధున కి ట్లనియె.

75


ఉ.

ఆదికి నాదియైన పరమాత్ముని విష్ణునిమూర్తఁ గాన బ్ర
హ్మాదుల చాల రవ్విభుశుభాకృతి యస్ఖలితైకభక్తిసం
చోదితుఁడై కృపం బొడవుచూపుఁ బ్రపన్నులకిచ్చ లైన న
వ్వేదమయుండు పొందుపడు వేఱొకటొల్లక తన్నుఁ జెందినన్.

76


క.

ఎఱిఁగినవారికి నెందును, గుఱుకొని తోనుండుఁ దన్నుఁ గొనకుండెడువా
రెఱుకలకుఁ జేరువయ్యును, బొఱయందగఁ డతఁడు నిఖిలభువనములందున్.

77


సీ.

కలఁడు మేదినియందుఁ గలఁ డుదకంబులఁ గలఁడు వాయువునందుఁ గలఁడు వహ్నిఁ
గలఁడు భానునియందుఁ గలఁడు సోమునియందుఁ గలఁ డంబరంబునఁ గలఁడు దిశల
గలఁడు చరంబులఁ గలఁ డచరంబులఁ గలఁడు బాహ్యంబునఁ గలఁడు లోనఁ
గలఁడు సారంబులఁ గలఁడు కాలంబులఁ గలఁడు ధర్మంబులఁ గలఁడు క్రియలఁ


గీ.

గలఁడు కలవానియందును గలఁడు లేని, వానియందును గలఁ డెల్లవానియందు
నింక వేయును నేల సర్వేశ్వరుండు, కలఁడు నీయందు నాయందుఁ గలఁడు కలఁడు.

78


చ.

అనవుడు రోషహాసవివృతాననుఁ డై దివిజారి యోరి నీ
వనయత నెందుఁ గల్గునని వర్ణనఁ జేసినయాతఁ డిందుఁ గ
ల్గునె యనుచున్ జగద్వలయఘోరకరాహతి వ్రేసెఁ గంబ మ
త్యనుపమతత్సభాభవన మల్లలనాడఁ గలంక లోకముల్.

79