Jump to content

పుట:నృసింహపురాణము.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

102

నృసింహపురాణము


ఉ.

వారల కెల్లకల్మషనివారిణియై మహనీయసంపుటా
కారిణియై విముక్తపదకారిణియై విలసిల్లుచుండు మ
త్కారుణికత్వలీల విను కష్టపుజాతియు న న్నహోబల
స్ఫారనివాసుఁ జేరి కనుబ్రాజ్ఞనిషేవితపుణ్యలోకముల్.

179


ఉ.

మానవకోటి కింక ననుమానము లేల విముక్తికల్మి వి
జ్ఞానవిహీనపక్షిపశుజాతములున్ దటినీమహీధ్రముల్
గ్రూనును రాయి లోనగుసమస్తచరాచరజంతుజాలమున్
బూని పునర్భవాతురతఁ బొంద వహోబలతీర్థవాసతన్.

180


తే.

విను మహోబలతీర్థపవిత్రసేవ, యందు రుచి యెల్లవారికి బొందనీను
మాయ గావింతుఁ గష్టపుమానవులకు, దానఁ జెడుదురు మాత్సర్యదర్పనిరతి.

181


చ.

అనితరతత్వశీలురగునట్టి మహాత్ములు మాయచేయుత్రి
ప్పున బడిపోక భక్తియుతభూతదయాకలితాంతరంగులై
యనఘు ననంతు నచ్యుతు ననాది నతర్కు నహోబలేశు న
న్ననుపమనారసింహు మహితాత్ము భజింతురు నిత్యధన్యులై.

182


తే.

నీవు మద్భక్తుఁడవు మునిదేవసమితి, కెల్లఁ గురుఁడవు గావున నేను నీకు
నధికగోప్యంబు విబుధరూప్యంబునైన, సిద్ధమంత్రంబుఁ జెప్పెదఁ జిత్తగింపు.

183


చ.

ఇలఁగలపుణ్యతీర్థముల కెల్ల నహోబల మెక్కుడన్ తలం
పలవడఁజేయుమామకములై చను భూతభవద్భవిష్యద
త్యలఘుతరావతారముల కన్నిఁటికిన్ నరసింహమూర్తి య
గ్గలముగఁ జూడు మివ్వధమ కాఁగనుమీ శ్రుతిశాస్త్రవీథులన్.

184


చ.

అని పరమాత్ముఁ డిట్లు పరమార్థకథారసలీల వీనులన్
దనియఁగఁ గ్రోల్చినఁ దగబితామహుఁ డుద్గతసమ్మదాశ్రులో
చనుఁడు పరిస్ఫురత్పులకచారుశరీరుఁడు నై సురారిభం
జను నరసింహు శ్రీరమణు సన్మతిలో నునిచెన్ దిరంబుగన్.

185


క.

సురలు మునీంద్రులు నానం, దరసాబ్ధిని దేలుచును సుదర్శనలక్ష్మీ
నరసింహమూర్తిమీఁదం, బరఁగించిరి తమసమస్తభావము భక్తిన్.

186


వ.

మఱియు సిద్ధసాధ్యచారణగందర్వాదులును బరమరసావేశంబునన్ దదాకారంబు గ
నుంగొనుచుం గౌతుకాశ్చర్యభక్తిభరితభావంబులతోడ జయజయశబ్దతత్పరులై యుం
డిరి. లక్ష్మీనరసింహదేవుండును బ్రహ్లాదు నఖిలదానవకులైశ్వర్యధుర్యుంగా నభిషేచ
నంబు చేసిన నతండును సాష్టాంగదండప్రణామంబులతోడ బహువిధస్తోత్రపవిత్రా
ర్చన లొనర్చినం బ్రసాదమధురాలోకనంబు లతనిపై సొలయ నప్పరమేశ్వరుండు
వరం బడుగుమనిన నమ్మహాత్ముం డిట్లని విన్నవించె.

187