పుట:నీతి రత్నాకరము.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మూడవ వీచిక

43


పాతాళుని మిత్రకోటిలో నొక్కఁడు 'చాల కాలము నుండి యనంతాచలశర్మ కడ విద్య నభ్యసించుచుండువాఁడు. వానిపేరు తుహినకిరణ శేఖరుఁడు. బుద్ధిమంతుఁడే కాని పాతాళుని స్నేహమున నించుక నీచ కార్యముల నొసరింప సాహసించుచుండువాఁడు. ఆ కార్యము గురువులకుఁ దెలియకుండ నేచాటుననో చేయుచు జంకుగలిగియే యుండువాఁడు. పాతాళుఁ డాతనిని దన ప్రియమిత్రులలో నొక్కనిగా భావించుచుఁ దనరహస్యములెల్లఁ దెలుపుచుండెను. ఆవాడుక చొప్పున వివాహ ప్రయత్నము తాఁ జేయుటయు దానికిఁ గుంత లాదులు తోడ్పాటు చూపుటయుఁ దెలిపెను. మఱెవ్వరితో నీవిషయము తెలుప రాదని చెప్ప మఱచిపోయెను. తన ప్రియ మిత్రుఁడన్న విశ్వాసమే యీ ప్రమాదమునకు హేతువని చెప్పవచ్చును.

తుహినకిరణ శేఖరుఁడు రాధికం బాతాళుడు దొంగిలి కొనిపోయి భరతపుర దేవాలయమునఁ బెండ్లియాడఁ జేయు చున్న ప్రయత్నములను మాట వెంబడిని సంగ్రహముగ గురువునకుం దెల్పెను. పిదప నిది యిట్లు జరగుట దైవవశముననే యనుకొని యతఁడు గుటకలు మ్రింగసాగెను. అనంతాచల శర్మయు నామాటల విని విననట్లు నటించి యెట్లో పాఠము ముగించి శిష్యులనెల్ల సాగనంపి తనలో నిట్లు తలపోయఁ జొచ్చెను. “పాతాళుఁడు పరమదుర్మార్గుడు. క్షుద్ర మంత్ర, తంత్ర ముల నెఱుంగును విశేషించి ఘాతుకుఁడు. ఎట్టివారినైన స్మృతి లేకయుండ మూలికా ప్రభావమునఁ జేయఁగలడని విన్నాఁడను. రాధిక నెట్లైన గొనిపోయి పెండ్లియాడును.