పుట:నీతి రత్నాకరము.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

40

నీతిరత్నాకరము

నీ కాకన్నియఁ దగినది కాదు. ఆప్రయత్నము మానుమని మఱి మఱి నొక్కి చెప్పెను.

పాతాళుఁ డాతనిం గాంచి నవ్వి యిట్లు పలికెను. వెఱ్ఱివాఁడా! పెండ్లి కానిమ్ము. ఆవల నన్నుఁ గన్యాజనకు లేమియుఁ ననఁజాలరు. రెండుమూడుదినములా గ్రహించి మరల సాదరముగాఁ జూతురు. మనల నింకొక్కనికిచ్చి పెండ్లి చేయఁ జాలరు. అట్టియాచారము లేదుకదా. విధి యిట్లున్న దని క్రమక్రమముగా నాయందుఁ బ్రీతిఁ జూపుదురు, కన్నియయు నిఁకఁ దప్పదుకదా యని నన్నుఁ బ్రేమించును. అన్నియు సరిపడును. నన్నే యెల్లవా రాశ్రయింతురు. ఆయింటి కధికారిని నే నగుదును కావున జంకుమాని నాయా నతిఁ జేయఁబూనుము. మంచిలాభమును బోఁగొట్టుకొనకుము. అని గట్టిగా బలికిన నేమి యుననఁజాలక కుంతలుఁ డట్లే యొనరింతునని యంగీకరించెను.

ఆమీఁదఁ బాతాళుఁ డింటికిం బోయి యంబాపూజా ర్దము కొన్ని వస్తువుల సేకరించెను. తనమాటలో మెలఁగు వారి కెల్ల నీవిషయము తెలిపెను. వారెల్ల సిద్ధముగ నుండిరి, కొన్ని మూలికలం దెప్పించి యొక యంజన ద్రవ్యము సిద్ధము చేసెను. మఱికొన్ని వస్తువులం గలిపి విస్మృతిని గల్గించు పానకము సిద్దపఱచెను అడవినుండి యుడుముల నాల్గింటిని దెప్పించి కాపాడుచుండెను. తనకుఁగల మంత్ర విద్యాపాండి త్యమునకు ఫలముగా నన్ని పనులు సిద్ధము చేసికొని వేళకై వేచియుండెను.