పుట:నీతి రత్నాకరము.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

36

నీతిరత్నాకరము

నెవరు కట్టించారో తెలియదు గాని దానినిర్మాణ మతివిచిత్రము. అందు రెండు గర్బాగారములు గలవు. ఒక్క దానియందు నృసింహమూర్తియు వేఱోక తావున మహా కాళియుఁ బ్రతిష్ఠింపఁబడిరి. ఆ నిర్మాణము కొత్తది. మఱెందు నిట్టివిధము కానరాదు. దానిం గట్టించిన వాఁడు నరసింహభ క్తుఁడు. కాళీ సేవకుఁడు కూడ నయినట్టు పొడగిట్టక మానదు. ఈ యిద్దఱు దేవతలు క్రూర దేవతలని కొంద ఱందురు. కాని వారు క్రూరదేవత లేకాలమునను గారు. భక్తుల వాంఛలననుసరించి దేవతా రూపము శాంతక్రోధములఁ దెలుపుచుండును. పేరును బట్టి తత్త్వ మెఱుఁగనివారు వెక్కండ్రు, క్రూరత్వ సౌమ్యత్వముల నారోపింతురు. అది పొరపాటుగాని వాస్తవము కాదు. ఆ దేవాలయము భరతపురమునకు మిక్కిలి సమీపముగాఁ గాక దూరముగాక యుండును. దాని ప్రాకార మత్యున్నతమై. యప్పుడు కట్టినట్లగపడును. ధ్వజ స్తంభము కూడ నున్నతమైనదియే. నిత్య నైవేద్య దీపారాధనములు మాత్రమే సాగును. ఇరువు రర్చకులు, వారికిం దృప్తిగా భూములు కలవు. వాని ననుభవించుచు నావిగ్రహములం గడుగుకొని వారు బ్రదుకు చుందురు.

ఆదేవాలయమునఁ బెక్కు మండపములు గలవు. వివాహము లామండపముల సాగుచుండును. లక్ష్మీదేవి నృసింహస్వామి పక్షమున నిలుచుటు జేసి యా దేవుని క్రూరత్వము ఫలింపదనియు మేలే కలుగుచుండుననియుఁ బామరుల విశ్వాసము.