పుట:నారాయణీయము.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దీవన

ఆబాల్య భాగవతోపాసకుఁడయి, యనవరత పురాణోపన్యాసములందు మత్కవితా విన్యాస మొనర్చుచు, వ్యాస భాగవతమును, పోతన భాగవతమును సమీకరించి యీ మత్కృతిని 'తాత్పర్యార్థ విశేషార్థ వివరణములతో సర్వ మధురము సర్వ సులభము నొనరించుచున్న నాయనుజన్ముడగు చిరంజీవి వీరభద్రుని భాగవతవిమర్శ గురుకృపచే గ్రంథస్థమయి యేతద్గ్రంథ సంకలితమగుఁగాక యని యాశాసించుచున్నాను,

శ్రీ అనంతలక్ష్మి రామకృష్ణరావు పుణ్యదంపతుల కనుంగు చిన్నారి బిడ్డడై శృంగగిరి పీఠాధీశ్వర చంద్రశేఖర భారతీ జగద్గురు శంకరాచార్య స్వామివారి ప్రసాదమున నుదయమందిన చిరంజీవి లక్ష్మీనారాయణరావు సభ్యుదయ పరంపరాభివృద్ధిగా నేతచ్ఛుభ ప్రసంగమున నిట్లు దీవించెదను.

హేమలంబే శరత్కృష్ణ పంచమ్యాం భానువాసరే
రోహిణ్యాం మత్కృతి రియం దత్తా నారాయణ ప్రభోః.

లక్ష్మీనారాయణ స్సాక్షా ల్లక్ష్మీనారాయణం శిశుం
లాలయే ద్రామకృష్ణాఖ్య దంపత్యోః కులభూషణమ్.

శ్రీ నారాయణ నాభి పంకజమునన్ గ్రీడించు విన్నాణి ల
క్ష్మీనారాయణు నస్మదీయ కృతికిం జిన్నన్న దీర్ఘాయువుం
గా నేలున్ మఱి శారదాజనని స్తన్యమ్మిచ్చి లాలించు బ్ర
హ్మానందంబు గురుప్రసాదమయి సర్వైశ్వర్యమై కూడగన్.

ఏతద్గ్రంథ రూపమునఁ బ్రసక్తికి వచ్చిన యిందరను మమ్మందరను నపార కరుణా కటాక్ష వీక్షణ ప్రసార మొనరించి యాత్మోన్ముఖులగావించుకొని సకల కల్యాణ భాజనుల నొనర్పుమని "శ్రీ గురువాయూరప్ప౯" పదసమభిధేయమగు మా కృష్ణప్ప నభ్యర్థించుచున్నాను.

ఇట్లు

కృతికర్త