పుట:నారాయణీయము.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

9


నిర్భయముగఁ జెప్పికొనఁగల సాహసముతోఁ గవిత్వము సాగించెనని వినఁగానే నాకును హృదయమున మెఱ మెఱ కల్గెను. కాని యామూల మా చూడము గ్రంథము నవలోకింప గ్రమముగా నా మదిలో నేననుకొనకుండనే యొక మార్పు గలిగి, యా కవితాధారలో మునిఁగి, నే నొందిన యవ్యక్తానందము నిందు వ్యక్తమొనరింప మానఁ జాలకున్నాను.

ఆంద్రీకరణమేకదా యీ కావ్యము! ఇందు మూలకారుని ప్రతిభయే కాని యాంధ్రీకర్త దేముండును? అని స్థూలముగ ననూధిత గ్రంథములను గాంచి నంతనే, చప్పరించి పెదవి విఱుచుట లోకసామాన్యవిషయము. కాని యనువాద క్లేశ మనుభవైక వేద్యమగుటచే నట్టి సాహసికుల నెవఁడు సమాధాన పఱుపఁగలడు ? సంస్కృతకవి ముందువాఁడుగాన నాతఁడు చమత్కృతిజనకములగు పదప్రయోగముతోను, అర్థసంయోగముతోను, దన యిచ్చవచ్చిన చొప్పునఁ జెప్పుకొనుచుఁ బోవును. ఆంద్రికర్తయో అట్టి పదముల నాంధ్రమునఁ ప్రయోగింపవచ్చునో లేదో పరిశీలించుకొని, వీలులేనినాఁ డంత సొగసు గల తెలుగు జాతీయమును బుద్ధికిఁ దెచ్చుకొని యదుకు కనఁబడకుండ, నర్థము చెడకుండ, ముందుగానే తెలుఁగునఁ బుట్టినట్లు ధారాళమగు శయ్యలోఁ జెప్పవలెను.. అప్పు డేవ్వరి ప్రతిభ గొప్పదో, యెవ్వరి శ్రమము పెద్దదో యూహించుకోఁ దగును. ...

నారాయణీయాంధ్రీకరణమునఁ బైనిజూపిన క్లేశము మాత్రమే కాక దురవగాహమగు భాగవతవిషయముగూడ నిగూఢముగ నుండుట మఱియు క్లేశము. “భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు, శూలికైనఁదమ్మి చూలికైన' అని పోతనవంటి దైవానుగ్రహపాత్రుఁడే భక్తిజ్ఞాన వై రాగ్యవిధానమైన భాగవతములోని విషయము సమగ్రముగఁ దెలిసికొని పలుక గడగడలాడెను. అట్టి భాగవతవిషయము ' చెదరకుండవలెను. ఉపమోత్ప్రేక్షాద్యర్థాలంకారముల తోడను, యమకానుప్రాసాది శబ్దాలంకారములతోడను, వ్యాకరణరహత ప్రయోగములతోడను ఛందోవై చిత్రితోడను ననన్యస్పృశ్యమగు ఫల్కులో రచింప బడిన నారాయణీయము నాంధ్రభాషాముకురమునఁ బ్రతిబింబింపఁజేయుట క్లేశాతి క్లేశమని వేఱ చెప్పవలెనా? అట్టియెడ మన దీక్షితకవిమౌళి యేరీతిఁ జరితార్థుఁడయ్యెనో స్థాలీపులాకముగాఁ గొన్నిఘట్టములు పరిశీలింతము.