పుట:నారాయణీయము.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

 శ్రీ నారాయణస్వామిని పద్యమయ నవరత్నములతోఁ బూజించి యలంకరించెనఁట. ఇందు రామకృష్ణుని యహంకారరాహిత్యమే కాదు, పాండిత్యమును, రంగౌచిత్యమును దెల్లమగుచున్నవి. ఈ విధముగాఁ గృతికన్యాదాన మహోత్సవము జరిపించి.

"లాలిత రీతి మమ్ముల నలంకృతులన్ బొనరించి మెచ్చి తాం
 బూలము నూత్నవస్త్రము లమూల్యములున్ మఱి సొమ్ములిచ్చి సు
 శ్రీ లలరించి బంగరు జరీగల సేలువ లిచ్చిరంత, దే
 వాలయ ధర్మకర్తయును నాత్మ విభుత్వము వే లొసంగఁగన్.

రచయిత యగు శ్రీ సుబ్రహ్మణ్య దీక్షిత కవిశేఖరుని ధన కనక తాంబూల జాంబూనదాంబరములతో సత్కరించి, "కావ్యం యశసే ౽ర్థకృతే" యను లక్షణమును లక్ష్య సమన్విత మొనర్చి యజరామర కీర్తివహించిన పరమపావన చరితులైనారు శ్రీ రామకృష్ణారాయ దంపతులు, పుణ్య శ్లోకులగు బూర్గుల వారిని దీక్షిత కవి దీవించిన దీవన లన్నియు సఫలము లౌఁగాక! ఆరోగ్య ప్రదాత యని విఖ్యాతుఁడగు వారిజామాత గురువాయూరు శ్రీ నారాయణస్వామి దైవతనేత శ్రీ రామకృష్ణారాయదంపతులకు వారి సంతతులకుఁ బరిపూర్ణాయు రారోగ్యసౌఖ్యప్రధాత యగుఁగాక ! యని యేనును దీవించి, వీరి కృతి కన్య యొక్క గుణశీలాదులను గూర్చి కూడ నాలుగు వాక్యముబు వ్రాయకుండుట యనుచితమగు నేమో యని యందులకుఁ బూనెదను.

"ఏగతి రచియించిరేని సమకాలమువారలు మెచ్చ రే కదా" యని సరస కవితా ధురంధరుఁడగు చేమకూర వెంకన్న యనినమాట ముప్పాతిక మువ్వీసము సత్యము. ఆ మెచ్చనివారు సమకాలమువా రందఱును గాకమానె. 'కవి' అని పేరు పెట్టికొనిన సమకాలపు నరమాత్రుఁ డెల్ల మెచ్చుకొనలేకపోవుట సహజము. కావుననే భవభూతి “ఉత్పత్స్యతే హి మషు కో2పి సమానధర్మా" అని భవిష్యత్తులో 'నా కష్టసుఖము లెఱింగినవాఁడు పుట్టఁగలఁడని పాపము ! తనలోఁ దా నూరడిల్లెమ. అట్టియెడ నాకంటె వయసునఁ జిన్న నాఁడై, నా కన్నుల యెదుట వ్యాకరణ యుక్తముగా సంస్కృతాంధ్ర భాషల సాహితి. నలవరించుకొన్న వాఁడై, అష్టాదశ పురాణముల నరసి యాంధ్రమున గద్య మయముగఁ దత్సారము. ప్రకటించిన మా సుబ్రహ్మణ్యదీక్షితు లింత యుద్గ్రంథ మింతటి రసవత్తర పాకమున "అస్మదీయ మధురాంధ్రవచః శ్రుతి" యనుచు