పుట:నాగార్జున కొండ.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇక్ష్వాకు రాజులు

క్రీ శ 3వ శతాబ్దిలో నాగార్జునకొండలోయలోని విజయపురి రాజధానిగా సుమారు ఏభై సంవత్సరాలకాలం దక్షిణాపధ ప్రాగ్భాగాన్ని ఇక్ష్వాకువంశీకులైన రాజులు పరిపాలించి ప్రఖ్యాతులైనారు. వీరి పరిపాలనాకాలం ఆంధ్రదేశ చరిత్రలో ముఖ్యమైన ఘట్టం. పురాణములలో ప్రాచీన రాజవంశముల ప్రశంస ఉన్నది. వాటిలో ఆయా రాజవంశముల పేర్లు, వంశముల క్రమమూ, ఆ వంశాలలోని రాజుల పేర్లూ, వారి పరిపాలనాపరిమితీ మొదలయిన అంశాలు ఉన్నవి ఇందులో ఆంధ్రరాజుల ప్రశంసకూడా ఉన్నది. ఈ ఆంధ్రరాజులే సాతవాహనరాజులు. ఈ ఆంధ్రసాత వాహనవంశంలో ముప్పయిమంది రాజులు 450 సంవత్సరాలు పరిపాలించినతర్వాత క్రీ. శ. 218 ప్రాంతంలో వారి సామ్రాజ్యం అంతరించింది. ఆతర్వాత మరి 50, 60 సంవత్సరముల కాలం అనేక రాజవంశములవారు సమకాలికులుగా పరిపాలించారు. ఇందులో కొందరు సాతవాహనుల కాలంనించీ ఉంటూ వచ్చారు. ఇట్లాంటి వారిలో ఆంధ్రభృత్యులూ, శ్రీపర్వతీయులూ ముఖ్యులు. ఈ రెండువంశాలవారూ ఆంధ్రులలోనివారే అని పురాణములలో చెప్పబడిఉన్నది. పురాణములలోని శ్రీపర్వతీయులే, శాసనముల