పుట:నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆగిపోయింది. ఆంధ్రప్రభ వారపత్రికది కూదా ఆంధ్రపత్రికతో దీటైన చరిత్ర. విద్వాన్‌ విస్వం గారి కలం నుంచీ వాకాటి పాండురంగరావు గారి వరకూ గొప్ప సంపాదకుల నేతృత్వంలో ఆ పత్రిక తెలుగు కథకూ, నవలకూ గొవ్ప ఆలంబనగా వుండేది. 1960-70 ప్రాంతాల్లో వారం వారం బాపు బొమ్మలతో సీరియల్లు గా రావడం తెలుగు నవలా చరిత్రలో మరుపురాని రోజులు. పురాణం సుబ్రమణ్యశర్మ గారి సంపాదకత్వంలో వచ్చిన ఆంధ్రజ్యోతి వారపత్రిక ఆనాటి సాహిత్య ప్రమాణాలకంతా దీటురాయిగా వుండేది. ఇక వ్యాపార నవలల ప్రచురణలో ఆంధ్రభూమి వార పత్రిక సంచలనాలను సృష్టించింది.

1995 వరకూ తెలుగు ప్రాంతాల్లోని ప్రతి నగరంలోనూ అద్దెకు పత్రికలనిచ్చే అంగళ్లు చాలా వుండేవి. వూర్లో చాలా చోట్ల పత్రికలనమ్మే అంగళ్లూ కనిపించేవి. 1980 ప్రాంతంలో దూరదర్శన్‌ కార్యక్రమాలకే పరిమితమైన టీవీ రాకతో కొత్త పరిణామాలు వచ్చాయి. సినిమా హాళ్ళతో పోటీ పడేలా టీవీ పార్లర్లు పుట్టాయి. వాటి ప్రభ వొకటి రెండు సంవత్సరాలు సాగింది. టీవీలోకి వ్యాపార ఛానళ్లు రావడంతో పాఠకుల్లో చాలా మంది అక్కడికి వలసపోవడం ప్రారంభమయ్యింది. వినోదానికి వ్యాపార నవలలూ, కథలు, చదివే పాఠకులు టీవీకి వెళ్లడం వల్ల పెద్ద ఇబ్బందేమీ లేదని కొందరు సరి పెట్టుకోజూశారు. వ్యాపార నవలలు రాసే రచయితలు సాహిత్యం నుంచీ వేరే విషయాలకు వెళ్లిపోవడం మంచిదేనని అనుకున్నారు. తమ ప్రాచుర్యాన్ని పెంచుకోవడానికి దినపత్రికల్లో గూడా సీరియల్‌ నవలల్ని ప్రచురించిన సందర్బాలు తగ్గిపోయినా పర్వాలేదనుకొన్నారు. అయితే క్రమక్రమంగా వార పత్రికలొక్కక్కటిగా అగిపోవడం ప్రారంభమయింది. అంతకు ముందే యువ, జ్యోతి అగిపోయాయి. పెద్దలు కూడా ఆవురావురమని యెదురు చూస్తూ ఉండిన “చందమామే” ఆశాభంగాన్ని మిగిలించింది. కొంతకాలం పాటూ తెలుగు కథకు ప్రోత్సాహాన్నిచ్చిన ఇండియాటుడే వారపత్రిక ముందు సాహిత్యాన్ని వదిలి పెట్టి తరువాత తెలుగునే మరిచిపోయింది.

2020 ఫిబ్రవరిలో కోవిడ్‌ అనే విపత్తు తెలుగు ప్రాంతాలను తాకేటప్పటికి తెలుగు పత్రికలు కొన్ని బలవంతంగానయినా మిగిలేవుండేవి. యీ చీకటి కాలంలో నవ్య అనే ఆంధ్రజ్యోతి వారపత్రిక మూతబడిఫోయింది. చివరకు ఈనాడు యాజమాన్యం కూడా విపుల, చతుర అనే మాసపత్రికల్ని వెజ్‌ పత్రికలుగా కుదించేనింది. యిప్పుడు తెలుగు సాహిత్యానికి మిగిలిందల్లా పాలపిట్ట, చినుకు, విశాలాక్షి అనే కొన్ని చాలా పరిమితమైన 'ప్రాచుర్వముండే పత్రికలు మాత్రమే. కొన్ని దినపత్రికల ఆదివారం అనుబంధాలు మూడునాలుగు పేజీల్ని కధకోసం కేటాయించి తమ వుదారతకు తామే మురిసిపోతున్నాయి. వొకప్పుడు పరిమితమైన విద్వావంతులకూ, విదేశీయులకు మాత్రమే అందుబాటులో వుండిన, వుండగలిగిన అంతర్జాల పత్రికలు యీ చీకటికాలంలో తెలుగు కథ, నవల, కవిత్వాలకు ఆలంబనగా మిగిలివున్నాయి.

మన యిరుగుపారుగు భాషలయిన తమిళ, కన్నడ, మలయాళాలలో యేంజరుగుతూ వుందో తెలుసుకోవడం కోసం కొందరు మిత్రుల్ని అడిగి చూశాను. మలయాళంలో యిప్పుడు కూడా బాగా ప్రాచుర్యంలో వుండే వార, మాసపత్రికలు యిరవైవరకూ వున్నాయట. యీ కరోనా సమయంలో కూడా కొన్ని పత్రికలు 'వోనం' పండుగ ప్రత్యేక సంచికలు ప్రచురించాయట! తమిళంలో యిప్పుడు గూడా పదిపన్నెండయినా కథలూ, నవలలూ, కవిత్వమూ ప్రచురించే వార మాసపత్రికలున్నాయన్నారు. అయితే తెలుగులో వొకప్పుడు ప్రచురించినంత ఖరీదైన పత్రికల్లాగాకుండా అవి మామూలు కాగితం పైనే ప్రచురించబడుతున్నాయి. అందువల్ల వాటిఖరీదూ తక్కువే! చదివేవాళ్ళూ యొక్కువే! కన్నడంలోనూ దాదాపుగా అదే పరిస్థితివుంది. మన యీమూడు సోదరభాషలతో పోలిస్తే దాదాపుగా రెట్టింపు జనసంఖ్యవుండే మన తెలుగులో మాత్రమే పత్రికలు బతికి బట్టగట్టు లేకపోయాయి. పత్రికలు మూతబడ్డాయనీ కేవలం రచయితలు మాత్రమే వాపోతున్నారు. అసలు పత్రిక అనే వొక సాంస్కృతిక భూమిక వుండేదని గుర్తయినా లేని జనం మాత్రమే తెలుగులో మిగిలిపోయారు.

యీ కరోనా సమయంలో మలయాళ ప్రభుత్వం పనిగట్టుకుని యింటింటికీ పుస్తకాల్ని చేర్చే యేర్చాటు చేసిందట! తెలుగు రాష్ట్రాల్లో గ్రంధాలయాలన్నీ యిప్పుడు దాదాపుగా చారిత్రక శిధిలాలుగా మారిపోతున్నాయి. తమిళమూ, కన్నడమూ, మలయాళాలలో వచ్చే పుస్తకాలను ప్రభుత్వమే వందలసంఖ్యలో కొని గ్రంధాలయాలకు చేరుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ లో ప్రభుత్వ ప్రచురణగా వస్తూవుండిన “ఆంధ్రప్రదేశ్‌ అనే మాసపత్రికకూడా ఆగిపోయిందని అనుకునేవాళ్ళు సయితం యిప్పుడులేరు.

కథ, నవల అనే ఆధునీక సాహిత్య ప్రక్రియలు పత్రికలు పుట్టిన తరువాతే (లేక పత్రికలతో బాటూనే) పుట్టి యింత ప్రయాణము చేశాయి. టాల్‌స్టాయ్‌, దాస్టోలిస్కీ చార్లెస్‌ డికెన్స్‌, చెకావ్‌, మొపాసా, ఓహెన్రీ, స్టెయిన్‌బుక్‌, రవీంద్రనాథ్‌ టాకూర్‌, శరత్‌ చంద్ర ఛటర్జీ, ప్రేమ్ చంద్ -యీ ఆధునిక రచయితల జాబితా చాలా పెద్దది. పత్రికలు లేకుండా యీ రచయితలెవర్నీ వూహించలేరు. ఆధునిక ప్రపంచ సాహిత్యానికంతా పత్రికలే ఆలంబన. టీ.వీ సినిమా వంటి ఆధునిక మాధ్యమాలెన్ని వచ్చినా తెలుగు ప్రాంతాల్లో తప్ప మిగిలిన అన్ని చోట్లా పత్రికలు అవసరమైనంత స్థాయిలో వెలుగుతూనే వున్నాయి.

1980 ప్రాంతంలో రచయితలకు ప్రచురించుకోవడానీకి పత్రికలు వుండడమే కాదు, రాసినందుకు పారితోషికాలు కూడా వుండేవి. క్రమంగా పారితోషికాలు ఆగిపోయాయి. పాఠకులు తగ్గారు. అయినా దాదాపొాక యాభైమంది వరకూ రచయితలు వందల సంఖ్యలో కవులూ రాయడమన్నదొక బాధ్యతగా రాసుకుంటూ పోతున్నారు. వున్న మిగిలిన కొద్దిమంది పాఠకులకూ, రచనలకూ మధ్య వారధిగా వుండాల్సిన పత్రికలే కూలిపోతే రచనల అస్తిత్వానికి ప్రశ్నలే మిగిలుతాయి. గత పది సంవత్సరాలుగా ఐటీ రంగంలో స్థిరపడిన విద్యావంతులూ, విదేశాల్లో స్థిరపడిన తెలుగువాళ్ళు బాగా చదవడమేకాకుండా, విడిగా రాయటంలో గూడా సాధన చేస్తున్నారు. అయితే అంతర్జాలానికి మాత్రమే పరిమితమైన ఆ సాహితీ సృజన అందరికీ అందుబాటులో వుండేలా కొన్నయినా పత్రికలుండాలి గదా!

యిుదొక అరణ్యరోదనం!

యెవరు పట్టించుకుంటారు?

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * నవంబరు-2020

47