పుట:నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నేర్పిస్తా.” కాస్త ఆవేశంగా మాట్లాడింది. కానీ ఆమె ప్రతి మాటా ఆలోచింపజేసేదే.

'మీ మాటలన్నీ గుర్తుపెట్టుకుంటాను. దేశం వెళ్లగానే మనోళ్లందరికీ చెప్పి మీకు మంచి చేయడానికి ప్రయత్నిస్తా" ముక్తాయింపుగా చెప్పా.

ఒక్కొక్కరూ తలలూపుతూ వెళ్లిపోతున్నారు. చీకటి పడుతోంది. మసన్న భోంచేయడానికి రమ్మన్నాడు. ఏదో అలా తినేసి భారమైన ఆలోచనలతో నిద్రకు ఉపక్రమించా. పేదరికపు అంచుల్లో ఉన్న ఈ తెలుంగుజాతి వారికి ఎలాగైనా సహాయం చేయాలనీ కంకణం కట్టుకున్నా.

తెలతెలవారుతుండగా మసన్న వచ్చి నిద్రలేపాడు. కాలువ కాడికి వెళ్లి స్నానం చేయాలని ముందు రోజు చెప్పిన సంగతి గుర్తొచ్చింది. ఇంకా అయిదు గంటలు కూడా కాలేదు. వేపపుల్లతో పళ్లు తోముకుంటా తువ్వాలను భుజానికేసుకుని బయల్దేరాం.

ఆ ఇండ్లు వీధులు దాటుకుని రాగానే అటూ ఇటూ పొలాలు. మధ్యలో ఎనిమిది అడుగుల వెడల్పున్న మట్టిరోడ్డు. చల్లటి పైరగాలి. ఆకాశంలో బంగారు వర్ణ కిరణాలు పరుచుకుంటున్నాయి. మనసంతా హాయిగా ఉంది...

మా ఎదురుగా నీళ్ల బిందె నడుముపై పెట్టుకుని ఓ యువతి వస్తోంది. ఆమెను చూడగానే మసన్న “మా లచ్చిమి" అన్నాడు.

నా గుండె కొట్టుకోవడం ఆగిపోయి ప్రపంచమంతా స్తంభించింది. తను మరెవరో కాదు, నా ప్రవల్లికే. అంటే ఈ జన్మలో శ్రీలంకలో లచ్చిమిలా పుట్టిందన్నమాట. ఆమెనే చూస్తుండిపోయాను. తను మా దగ్గరికి రాగానే మసన్న..

“అమ్మా అచ్చిమి, పురం నుంచి ఎప్పుడు వస్తివి?

“'ేయి పొద్దుపోయినాకు వచ్చిన చిన్నాన్న.

ఆ తియ్యటి న్వరం నా మనసుకు ఉయ్యాల ఊపినట్టుగా అన్పించింది. నాడు రాకుమారిలా చూసిన యువతిని నేడు సాధారణంగా చూడడం కాస్త ఇబ్బంది కలిగిస్తోంది. ఆమె భుజాన తడి బట్టలు ఉన్నాయి. అంటే ఇంత పొద్దున్నే నిద్రలేవడమే కాదు, బట్టలు ఉతుక్కుని మంచినీటిని ఇంటికి తీసుకెళుతోంది. కష్టజీవిగా అన్పించింది.

తనకు నన్ను పరిచయం చేస్తూ..'ఇతడు సూర్య, దేశం నుంచి వచ్చాడు. మనింట్లోనే ఉంటాడు. మళ్లీ కలుస్తాంలే అన్నాడు మసన్న

లచ్చిమి నన్ను చూస్తూ పలకరింపుగా నవ్వి ... ముందుకు సాగింది.

ప్రపంచంలోని పూలజాతులన్నీ ఓ వైవు వేసినా ఎంతకీ తూకనిది ఆమె నవ్వు.

ఆలోచనలతో అలాగే మసన్నను అనుసరించా.

కాలువ వచ్చింది. కొంత మంది పురుషులు ఈతకొడుతున్నారు. కాస్త దూరంలో స్త్రీలు ఉన్నారు గట్టుమీద.

నేనూ, మసన్నా నీళ్లలోకి దిగాం. అంత లోతుగా లేదు. చాలా చల్లగా ఉన్నాయి నీళ్లు.

సూర్యా, ఇదంతా కలవేవ నీళ్లే. కలవేవ అనేది ఇక్కడ పెద్ద మంచి నీటి సరస్సు. రాజుల కాలంలో నిర్మించారు. ఎన్నో కాలువల ద్వారా ఆ నీటిని వ్యవసాయానికి మళ్లిస్తున్నారు. అలాంటి ఓ కాలువే ఇది. ఎండల కాలమైనా ఆ సరస్సు ఎండిపోదు. ఈ కాలువ ఎప్పుడూ ఇలాగే ఉంటుంది.” మసన్న వివరిస్తున్నాడు.

ఆ విషయాలన్నీ గొప్పగా ఉన్నా నా ధ్వాసంతా ప్రవల్లిక మీదే.ఇంటికి ఎప్పుడు వెళ్లాలి, ఆమెను ఎప్పుడు కలవాలి అనే ఆలోచిస్తున్నా.

ఇంటికి వచ్చాక కూడా అదే ధ్యాస. నా గదిలోకి వెళ్లిపోయా.బల్లమీద కూర్చుని కిటికీలోంచి చూస్తూ ఆలోచనలో మునిగిపోయా. అలా ఎంత సేపు ఉన్నానో..

“చిన్నమ్మా”. బయటి నుంచి మృదువైన స్వరం వినిపించింది. ప్రవల్లికదే అని నా మనసు చెప్పింది. కానీ బయటకు రాలేకపోయాను.

“సూర్యా అంటూ మసన్న పిలవడంతో హాల్లోకి వచ్చా. ఎదురుగా లచ్చిమే ఉంది.

“ఇండియా బుద్ధ పాదాల యాత్ర గురించి తెలుసుకోవాలని ఉంది అన్నావ్‌ కదా, లచ్చిమితో మాట్లాడు” అన్నాడు.

మేం ముగ్గురం హాల్లోనే కూర్చున్నాం. వదిన వంటింట్లో ఉంది.

కాస్త చొరవగా '“లచ్చిమి, నువ్వు ఇండియాలో ఎక్కడెక్కడికి వెళ్ళావ్‌?”

నన్ను ఓ క్షణం తేరపార చూసింది. కాసేపు ఏదో ఆలోచించి...

“బుద్ద భగవానుడికి సంబంధించి ముఖ్యమైన బుద్ధగయ, సారనాథ్‌, కుషీనగర్‌కు వెళ్లాం. నేపాల్‌లోని బుద్ద జన్మస్థానం లుంబినిలో ప్రార్ధనలు చేశాం. తిరిగి వస్తూ దక్షిణ భారతదేశంలోని నాగార్జునకొండకు వెళ్లాం. అక్కడ వేల ఏళ్ల క్రితం మా సింహలీయులు నిర్మించిన విహారాన్ని దర్శించాం. మూడు రోజుల పాటు ప్రత్యేక ప్రార్ధనలు జరిపాం. అక్కడ అందరూ తెలుంగు మాట్లాడుతున్నారు. వాళ్లంతా మా కుదురే అన్పించింది. మీరు తెలుంగు వారా?” సూటిగా ప్రశ్నించింది.

“అవును, నాగార్జునకొండ సమీపంలో మా ఊరు ఉంది”

“లచ్చిమీ, సూర్య మన చుట్టం. పురంలో మహాబోధి దగ్గర నాకు కన్పించాడు. మనూరికి తీసుకువచ్చా. తనకి మన తావులన్నీ నువ్వే దగ్గరుండి చూపించాల” మసన్న నా గురించి లచ్చిమికి చెబుతున్నాడు. తను ఆసక్తిగా నన్నూ మసన్ననూ చూస్తోంది.

సూర్యా మా కలవేవలో కాలేజీ వరకు చదువుకుంది లచ్చిమి ఒక్కతే. అందుకే నీ పనులన్నీ తనకి పురమాయించాను” మసన్న వివరిస్తున్నాడు. సింహళం, తమిళం, తెలుంగు, కాస్త ఆంగ్లమూ మాట్లాడగలదు.

“లచ్చిమీ...” వాళ్ల నాన్న పిలుపనుకుంటా.

“వస్తున్నా అయ్యా” అంటూ మళ్ళీ వస్తా చిన్నాన్న అని చెప్పి వెల్లిపోయింది.

“తల్లి లేని పిల్ల, అయ్య గారాబంగా పెంచినా అందరికీ సహాయం చేయడంలో ముందుంటుంది. మంచి పనిమంతురాలు'కళావతి వదిన లచ్చిమి గుణగణాలు వివరిస్తోంది.

నా మనసు గాల్లో తేలుతోంది. ప్రవల్లిక అదే నేటి లచ్చిమి నా కళ్లెదురుగానే ఉంది. నా పక్క ఇంట్లోనే నివసిస్తోంది. ఈ ఊహే నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తనకి నేను గుర్తులేను. థాయిలాండ్లో మా ప్రేమ కథంతా తనకి తెలియజేయాలి. కానీ ఎలా... తను నన్ను విడిగా కలుస్తుందా? అదంతా నిజమని నమ్ముతుందా?

కట్టు కథని కొట్టిపారేస్తే... లచ్చిమితో ఎలాగైనా సరే మనసు విప్పి మాట్లాడాలి...

ఎలా... ఎలా... ఎలా?

(తరువాయి వచ్చే సంచికలో...)

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * నవంబరు-2020

45