పుట:నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



దాన వివరాలున్నాయి.

తంగెడకు పడమరగా అడవిలోనున్న క్రీ.శ.1391 నాటి కుమారగిరిరెడ్డి శాసనంలో చొక్మన సింగన , స్థానిక నరశింహస్వామికి, అళ్వార్లకు గోంగులపాటి (గోగులపాడు) దాసపల్లి(దాచేపల్లి) అనంతగిరి (అనంతారం), పినగారిపాడు (గారపాడు), కల్లుపాడు(కర్లపాడు) బయ్యనపాడు, ఆకురాజుపల్లె, కొత్తపల్లి, కాచవరం, తక్కెళ్లపాడు, చింతపల్లిలో కొంత భూమిని, చింతపల్లి గోపులెంక తెలుంగరి, కొంత భూమిని, గోపాయ రెడ్డి తన జీత తుమ్మలచెరువులో మీద కొంత ఆదాయాన్ని సమర్పించినట్లు చెప్పబడింది. లెంక అనగా రాజుల విశ్వాససేవకుడు. గోపులెంక తెలుంగరి అని చెప్పబడింది. తెలుంగరి అనే శబ్దం అర్ధంపై పరిశోధించాలి. గోపాయరెడ్డి, తంగెడ ఎక్కటీలు(సైనికులు) తమ జీతాల వల్ల కొంత భూమికొనిచ్చారు. జీతం అన్న పదం ఆనాడు వారి సేవలకుగాను ప్రభుత్వం సంవత్సరానికిచ్చే భూమి రూపంలోని పారితోషికంగా చెప్పుకోవచ్చు. అదే బ్రిటీషు కాలానికి నెలజీతమైంది.

వేణుగోపాలస్వామి ఎదురుగా పాతిన గరుడస్థంభం పైనున్న క్రీ.శ. 1394 నాటి కుమారగిరిరెడ్డి శాసనంలో వెల్లంపల్లి రాజబంట్లు, పడాలు (సైనికులు), వారి జీతాల్లో కొంత భాగాన్ని గోపీనాధునికి సమర్పించినట్లుగా చెప్పబడింది. క్రీ.శ. 1509 నాటి ప్రతాపరుద్ర గజపతి శాసనం, తంగెడ గజపతుల పాలనలో కొచ్చినట్లు తెలియజేస్తుంది. క్రీ.శ. 1656 నాటి కాకునూరి అప్పకవి, తన 'అప్పకవీయం'లో తంగెడ, కృష్ణకు దక్షిణంగా కొండవీటికి పశ్చిమంగా, శ్రీశైలానికి ఈశాన్యంగా ఉందని రాశాడు. గజపతుల తరువాత ఈ సీమ విజయనగర రాజులు, కుతుబ్‌షాహీల పాలనలోకొచ్చింది.


తంగెడ దక్షిణ కోట గోడ ఆనాటి రాచరికపు వ్యవస్థ, ప్రధాన ద్వారం 'ప్రక్మన చిన్న ద్వారం, వచ్చీపోయేవారి నియంత్రణ పద్దతికి ఆనవాళ్లు. ద్వారానికి దక్షిణంగా సగానికి పైగా పూడుకుపోయిన దుర్గాదేవి ఆలయముంది. గ్రామంలో ఎవరైనా తప్పుచేస్తే నిజం ఒప్పించే సాక్ష్యవేదికగా ఇప్పటికీ తన ప్రాముఖ్యతను నిలుపుకొంటుంది. ద్వారంలో ప్రవేశించేముందు, ఎడమ వైపు బురుజు పక్శనే ఒక శాసనం కూరుకుపోయి, దాని శ్వాసనాళాలు మూసుకుపోయాయి. వీరభద్ర, వీరేశ్వర, గంటల రామలింగ ఆలయాలు కొద్దిగా ఆధునీకరింప బడినాయి. కానీ వేణుగోపాల ఆలయం, ఇతర కట్టడాలు, శాసనాలు, ప్రాచీనతతో పురాతనాన్ని ఒలికిస్తున్నాయి. ఊళ్లో పశువుల ఆసుపత్రి దగ్గరున్న ద్వికూటాలయం ముందు వసారాలో ఒకరు ట్రాక్టరును నిలుపుకొంటున్నారు. ఆలయం గోడల వెంబడి, స్థానికులు చెత్తను కుప్పలుగా పోస్తున్నారు. కోపం కట్టలు తెంచుకుంది. ప్రజాస్వామ్యం ఇచ్చిన అలుసుతో అందరికీ చెందిన ఆలయం కొందరి సొంత వనులకు పరిమితమైందేమో అనిపించింది. ఒక వైపు నీటి తొట్టి, మరో వైపు పశువుల ఆశుపత్రి, గోడలను దాటితే ఏపుగా పెరిగి సర్కార్‌ తుమ్మలు నిర్లక్ష్యానికి నిలువుటద్దాలయ్యాయి.

క్రీ.శ. 14వ శతాబ్ధి ఆలయం బయట ఇలా ఉంది, లోపల ఎలాఉందోనని తొంగి చూశా. గుప్తనిధుల కోసం మండపం, గర్భాలయాలను తవ్వేసి చిందర వందర చేశారు. కప్పు బండలు తొలగిపోయాయి వానలు కురిసి మట్టి పేరుకుపోయింది. ముట్టె విరిగిపోయినా, అపురూపంగా చెక్కిన నంది, ఈ ఆలయం ఒకప్పుడు త్రికాలార్చనలందుకొన్నదని చెబుతుంది. తంగెడ కృష్ణానది ఒడ్డునున్నా తాగు నీటికి ఎప్పుడూ కటకటే. ఎప్పుడో మధ్య యుగాల్లో రాతినేలను తొలచి మలచిన మెట్లబావి ఆ ఊరికి ఆకాశ గంగ. బావిలోపల ఒక మట్టంలో ఒక ఆలయం, ఇంకోమట్టంలో మరో ఆలయం. ప్రక్మనే రావిచెట్టు, ఆచెట్టు ముందు ఇంకొక చిన్న ఆలయం. అన్నీ చూచిన తరువాత, కొట గోడల చుట్టూతిరుగుతున్న నాకు, ఆ గోడ లోపల గడ్జివాములు, పశువుల కొట్టాలు, గోడకు బయట చెత్తకుప్పలు, పిచ్చిమొక్కలు, యుద్ధంలో చేయితెగిన సైనికునిగా కనిపిస్తున్న పడిపోయిన పశ్చిమ సింహద్వారపు నిలువు స్థంభాలు, నాకు మళ్లీ మనశ్శాంతి లేకుండా చేశాయి. పశ్చిమ ద్వారం నుంచి బయటికొచ్చి మట్టపల్లి బ్రిడ్జి దాకా వెళ్లాను. అక్కడ పులిచింతల రిజర్వాయరులో మునిగే ఒక 13వ శతాబ్ది దేవాలయాన్ని ఊడదీసి పదేళ్లక్రితం ఆ రాళ్ళను రోడ్డు ప్రక్కనే అనాధ శవాల్లా పడేశారు. చక్కటి చెన్నకేశవ విగ్రహం ముక్కలైంది. రోడ్డుకు ఎడమవైపున ఏనుగులు నీళ్లు త్రాగే 20 అడుగుల పొడవు ౩ అడుగుల లోతు, అంతే వెడల్పుగల రాతి తొట్టి ఎవరికీ పట్టకుండా ఉంది. ఇంకా ముందుకెళ్లాను. వరుసగా దాదాపు వంద వరకూ రాతి పెట్టెల్లాంటి కట్టడాలు కన్పించాయి. పరిశీలించి చూస్తే

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * నవంబరు-2020

40