పుట:నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇది వ్యక్తులకే కాదు, భాషలకూడా వర్తిస్తుంది.

ప్రతికూల వాతావరణం

తెలుగువారి ఈ మాతృభాషావ్యతిరేక మనస్తత్త్వమూలాలు చాలా లోతైనవి. ఈ సందర్భంలో వాటిని టూకీగానైనా గుర్తు చేసుకోకుండా ఉండలేం. స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని దశాబ్దాలైనా మనం భాషాపరంగా సంపూర్ణ బానిసత్వంలోనే కానసాగుతున్నాం. నోటిమాటగా ప్రజాస్వామ్యం అంటూ ఊదరగొడుతున్నాా వాస్తవంగా ప్రజాభాషైన తెలుక్కి ఏ విధమైన రాజకీయ, ఆధికారిక హోదా లేకపోవడం వల్ల ఈ భాష పట్ల విస్తారంగా వ్యాపించిన చిన్నచూపూ, హీనభావన చివఱికి ఈ భాషాప్రజలు తమ మాతృభాషాపదాల్ని తాము వాడుకోవడాన్ని కూడా ఓ అప్రాచ్యప్పనిగా, అవహేళనగా, ఎగతాళిగా ఒక రహస్య నిషిద్ధ కార్యకలాపంగా మార్చాయి. నాలుగు ఇంగ్లీషు ముక్కలు నేర్చుకున్న ప్రతి తెలుగువాడూ తన జాతీయతా మూలాలు మర్చిపోయి “తానో పుట్టు అమెరికన్‌” అన్నట్లు ప్రవర్తిస్తూ తెలుగుని బహిరంగంగా కించపఱచదానీకి వెనకాడ్డం లేదు. నిజంగా అమెరికన్‌లై పుట్టినవాళ్ళు కూడా ఇలా చేయరు. ఆంధ్రప్రభుత్వం తెలుగుని ఏ మాత్రమూ పట్టించుకోకపోవడంతో “మొగుడు ముండా అంటే ముష్టివాడు కూడా ముండా అన్నా” డన్నట్లు తయారయింది పరిస్థితి. అలాంటి వాళ్ళు అలా కించపఱుస్తూంటే “అది తప్పు. మన మాతృభాషని మనం అలా అనకూడ"దని ఎలుగెత్తి ఖండించే వాళ్ళు కూడా లేకుండాపోయిన దౌర్భాగ్య పరిస్థితుల మధ్య ఈ జాతి జీవిస్తోంది. దేశపౌరుల్ని విదేశాలకీ, విరాష్ట్రాలకీ సామూహికంగా ఎగుమతి చేయడానికి, ఆ విధంగా వారిని శాశ్వతంగా ఇక్యణ్ణించి లేవగొట్టి వలసపంపడానికి మాత్రమే ఉద్దేశించిన మన విద్యావ్యవస్థ మాతృభూమి, మాతృభాష, స్వజాతి అనే భావనల్ని మనవారిలో లోతుగా నాటడంలో విఫలమవుతోంది. జాతిపరమైైన స్వాఖిమానమూ, ఆత్మ గౌరవమూ లేకుండా ప్రవర్తించడమే ఆధునికతగా, విశాలహృదయంగా మన మధ్య ప్రచారంలోకి వచ్చేసింది.

దీనికి తోడు పెక్కు అంతర్జాతీయ ప్రసార సంస్థలూ, జాలగూళ్ళూ (websites) తెలుగుని తమ భాషల జాబితాలో చేర్చవు. కానీ ఆ జాబితాలో తమిళం, హిందీ, బెంగాలీ మాత్రం ఉంటాయి. కొన్నిసార్లు ఉర్దూ, గుజరాతీ, పంజాబీ కూడా ఉంటాయి. దీనిక్కారణం, తమిళమూ, హిందీ, బెంగాలీ ఏదో ఒక స్వతంత్ర దేశానికి జాతీయభాషలూ, అధికార భాషలై ఉండడం. తమిళం శ్రీలంక, సింగపూర్‌, మలేషియా అనే స్వతంత్ర దేశాల్లో (సహ) అధికారభాషగా ఉంది. హిందీ ఇండియాకి అధికార భాషగా ఉంది. బెంగాలీ బాంగ్లాదేశ్‌కి అధికారభాషగా ఉంది. కానీ టోకున పన్నెండుకోట్లమంది తెలుగు భాషులూ, 2000 సంవత్సరాల చరిత్రా, అనేక దేశాలకంటే సువిశాలతరమైన ఒక పెద్దరాష్టమూ ఉన్నప్పటికీ, తెలుగు ఏ దేశానికి జాతీయభాష గానీ, అధికారభాష గానీ కాకపోవడంతో ప్రపంచభాషల జాబితాలోకి ఎక్కలేని, ప్రపంచానికి పరిచితం కాలేని విచిత్ర నిస్సహాయ పరిస్థితిలో పడిపోయింది.

“పిచ్చి ముదిరింది, రొకలి తలకు చుట్ట"మన్నట్లు ఈ పరిస్థితికి భాషాశాస్త్రవేత్తలమని చెప్పుకునేవారు కొందణు తోడయ్యారు. భాషని సరిగా నేర్చడం, కాపాడడం, దాన్నీ భవిష్యత్తరాలకి భద్రంగా అందించడం -ఇలాంటివాటిమీద సుతరామూ నమ్మకం లేనివారు వీరు. భాషాపరంగా పక్కా శూన్యవాదులూ, భాషానాస్తికులు. భాషావేదాంతులు. వీరు తమ ఆయుర్దాయంలో అనేక సంవత్సరాలు వెచ్చించి చివరికి నేర్చుకున్నది, “భాష శాశ్వతం కాదు. భాష నశించిపోతూంటే మనం గుర్లు మిటకరిస్తూ చూస్తూ కూర్చోవాలి. ఏ భాషైనా ఒకటే. ఏ పదమైనా ఒకటే” అని! నిజానికి ఇలా ప్రసంగించే వారు భాషా శత్రువులే తప్ప శ్రేయో.... ఖిలాషులు కారు. కానీ దురదృష్టవశాత్తూ, తెలుగుమీద మాట్లాడడానికి ఈ రోజున ఇలాంటివారే గొప్ప ప్రామాణిక విద్వాంసులై కూర్చున్నారు. వీరి వైరాగ్యపూరితమైన దుర్చోధల ఫలితంగా నిజమైన భాషాఖిమానులూ, భాష మనుగడ కోసం ఏదో ఒకటి చేయాలనే తపన ఉన్న కార్యశూరులు కూడా తప్పుదోవ పడుతున్నారు, నిరుత్సాహం చెందుతున్నారు. మనం ఒక జాతిలో జన్మించాక దాని భాషా, మత, సంస్కృతుల పట్ల తటస్థంగా ఉండే హక్కుని కోల్పోతాం. ఎందుకంటే ఆ సంస్కృతికి మనం తప్ప వేఱే దిక్కులేదు.

మానసిక అవరోధాల్ని అధిగమించాలి

నా దృష్టిలో ఇది తెలుగు-ఇంగ్లీష్‌ గొడవ కాదు. ఇది ఒక మానవ కల్పిత మానసిక అవరోధానికి (mental barrier కి) సంబంధించిన విషయం. నిజానికి తెలుగుపదాలూ మన సృష్టి కాదు. ఇంగ్లీషు పదాలూ మన సృష్టి కాదు. ఈ రెండూ కూడా ఎవఱో,ఎప్పుడో, ఎక్కడో కల్పించగా మనం నేర్చుకుని వాడుకున్నవే. మనకి ఈ విషయంలో ఏ విధమైన నిర్ణయాధికారమూ (judgement) లేదు. కానీ మనం అలా తీర్చు తీర్చబూనుకుంటున్నాం. ఇంగ్లీషుని అందుకోవడానికి సిద్దంగా మనం మన మనస్సుల్ని కార్యక్రమించాం. తెలుగు విషయంలో అలాంటి కార్యక్రమణం (programming) జఱగలేదు.

అర్ధం కావడమనేది ఒక ఉత్తరోత్తర ప్రక్రియ (incremental process). మనకి పదేళ్ళప్పుడు అర్థం కానివి ఇఱువ య్యేళ్ళప్పుడు అర్థమవుతాయి. ఇఱవయ్యేళ్ళప్పుడు అర్థం కానివి నలభయ్యేళ్ళప్పుడు అర్థమవుతాయి. “జీవితం ఒక నిరంతర అభ్యసనా ప్రక్రియ” అని ఇందుకనే చెప్పుకున్నాం కదా! అలా కాదు, అన్నీ విన్నవెంటనే అర్థమైపోవాలని పట్టుపట్టితే అది అపరిణతి అవుతుంది. భాష యొక్క ప్రయోజనం అర్థం కావడమొక్కటే కాదు. ఇంకా చాలా పనులు(functions) ఉన్నాయి దానికి! భాష ఒక జాతి యొక్క దృక్పథాన్ని ఆవిష్కరిస్తుంది. అది ఒక జాతిని సృష్టిస్తుంది కూడా. గతానికీ, వర్తమానికి వారధిగా నిలుస్తుంది. అలాగే వర్తమానానికీ, భవిష్యత్తుకీ మథ్య కూదా వారధిగా నిలుస్తుంది. అది విజ్ఞానాన్ని అందిస్తుంది. వినోదింపజేస్తుంది. అది సంగీతాది కళలకి ఆలంబన. ఆధ్యాత్మికతకి తొలిమెట్టు. అది ఒక సమాజాన్ని కలుపుతుంది. తెలిసిన పరిభావనల నుంచి తెలియని పరిభావనలకి అది మనల్ని తీసుకెళుతుంది.

వచ్చే సంచికలో... తెలుగులో అనేక భాషాపదాలున్నప్పుడు ఇంగ్లీషు పదాలు ఎందుకు ఉండకూడదు ?

“సొంత భాషలో చదువుపల్ల పిల్లల్లో వ్యక్తిగా, సామాజికంగా, సాంస్క్రృతికంగా గుర్తింపు కలిగి ఉండే విశ్వాసాన్ని ఎదగనిస్తుంది”

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * నవంబరు-2020

33