పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/690

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

624

ద్విపద భారతము.


యమసుతుఁడరిగె జింతాక్రాంతుఁడగుచు;
రమణ భీముఁడు 'సంగరస్థలమునను
జేతులుకసివోవఁ జెనసి శాత్రవుల
శాతాయుధంబులఁ జంపగఁగలను'
అనుచు బాహులుచాచి యరిగె వేగమున ;
'అని నింతకునుదఱచైనబాణముల
వెసవేసి రిపుల వావిరిఁద్రుంతు' ననుచు
నిసుముచల్లుచుఁ బోయె నింద్రనందనుఁడు ;
'తనరూపుచూచి భూతలమువారెల్ల
నొనర దుఃఖంబులనొందుదు' రనుచు
ధూళిగప్పినమేన దొరయంగ నేఁగె
నోలి నానకులుఁ డత్యురుపరాక్రముఁడు ;
'తనదీనవదనపద్మము విలోకించు-
జనులకు నెగ్గులు చాలంగఁబుట్టు'
నని యాననమువంచి యాసహదేవు
చనియె గూఢాచారసన్మార్గమునను ;
తడిసినయేక వస్త్రంబుతోడుతను
గడువడి వీడినకచభరంబునను
శోకంబుతో నేఁగె సొలసిద్రౌపదియు
'నాకౌరవస్త్రీలు నధిక దుఃఖములఁ
బొందుదు రిటమీఁదఁ బొ ' మ్మనునట్టి
చందంబునందును; సమరంబునందుఁ
బాండవేయులచేతఁబడుకౌరవులకుఁ
బాండిత్యమహిమను బరలోకగతులు
చేయింప సూచించుచందంబుదోప
నాయెడ నతిరౌద్ర [1]యామ్యాగమోక్తి

  1. యాయాగ. (మూ)