పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/678

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

612

ద్విపద భారతము.


ధృతరాష్ట్రుఁడు ద్రౌపదికి వరములొసగుట

ద్రౌపదిరావించి తనరనిట్లనియె :
"ఓపుణ్యవతి, సాధ్వి, యోసత్యనిరత,
కొమరారుచున్న మాకోడండ్రలోన
నమిత [1]పతివ్రత వతిసత్యవతివి ;
వరమిచ్చెదను నీకు వనజాక్షి వేఁడు
పరఁగంగ." ననిన ద్రౌపదియు నిట్లనియె :
"ఇలనాథ, వరమునాకీఁజాలుదేని,
దలఁపంగ ధర్మజుదాస్యంబుమానఁ
గృపసేయు." మనిన నాక్షితిపతి యిచ్చి
యుపమ వెండియుఁబల్కె నుచితభంగులను:
'ఇంకొక్కవరము నీకిచ్చితి నడుగు
శంకింప.' కనినఁ బాంచాలి యిట్లనియె:
"ధర్మజునలువురుతమ్ములు నెల్లఁ
బేర్మి దాస్యముమానఁ బెద్దయు నిచ్చి
హయ రథ గజ వివిధాంబరావళులు
ప్రియమున నొసగుము ప్రేమ వారలకు. "
ననుటయు ధృతరాష్ట్రుఁ డావరంబొసగి :
'వనజాక్షి, యింకొక్కవరము నీవడుగు
పరమార్థముగ, ' నన్నఁ బాంచాలిపలికె:
"వరవైశ్యసతికిని వరముదా నొకటి,
క్షత్త్రియసతికిని జర్చింపరెండు,
ధాత్రి శూద్రస్త్రీకిఁ దలఁపంగ మూఁడు,
పరమపవిత్ర సద్బ్రాహ్మణస్త్రీకి
వరములునూఱైన వడి వేఁడనగును;
కాన నాకిఁక వేఁడఁగారాదు వరము ;
భూనాథ, యీవరంబులురెండు చాలు."

  1. పాతివ్రత్యమతి. (మూ)