పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/656

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

590

ద్విపద భారతము.


నలువొప్ప నీదుధనంబుగావునను
దలకొనియొడ్డి జూదంబాడు. " మనిన
'నవుఁగాక' యని జూదమాడి ధర్మజుఁడు
ధవళలోచన సాధ్వి ద్రౌపదినోడె.
వెసనోడి మిక్కిలి [1]వికలాత్ముఁ డగుచు
నసహాయుఁడై దుఃఖమధికమై యొదవ
హరి -------సాంభోరుహమునందు నిలిపి
తెరలక సర్వంబుఁ దృణముగాఁదలఁచి
పాండవాగ్రజుఁడంతఁ బరతత్త్వబుద్ధి
నుండంగఁ, గృపుఁడును నొగిఁ గుంభజుండు
గాంగేయుఁడును గుణాకరు ధర్మసుతుని
నాంగితుఁ గనుఁగొని యధికశోకమునఁ
దద్దయుఁబొగులుచు దరినుండి రంత
నెద్దియుననలేక హీనస్వరముల.
విదురుఁడు మిక్కిలి విముఖుఁడై కలఁగి
మదిలోన శోకాగ్నిమగ్నుఁడై యుండె.
ఆసభ వారు బాష్పాంబుపూరములు
వే సముద్రముభంగి వెల్లియైనిగుడఁ
గుపితదుఃఖముల నెక్కొనియుండిరపుడు.
అపుడు భూతాక్రోశమయ్యె నెయ్యెడను;
అగుటయుఁ గర్ణుండు నాశకునియును
అగణితదుర్గుణుండాసైంధవుండు
దురితశరీరుండు దుశ్శాసనుండుఁ
బరమానురాగులై బలసియొండొరుల
మొగములుచూచుచు ముచ్చటలాడి
నగుచుండిరచట నానాప్రకారముల.

  1. వికలచిత్తుండగుచు. (మూ)