పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/615

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సభాపర్వము ; ద్వితీయాశ్వాసము

549


నేనుబూజించితి ; నిదియెగ్గుగాదు;
మానసంబున నీవు మానుకోపంబు,
గురుఁడు దైవంబని కుంభినీశ్వరులు
వరుసతోఁ గృష్ణుని వదలకకొలువ,
నిందింపఁదగునయ్య నీకునచ్యుతుని !
నెందును బగమాను హితబుద్ధి," గనుచు;
శిశుపాలు రమ్మని చెలఁగిపిల్చుచును
విశదోక్తులందును వేడ్కమన్నింప,
నంత భీష్ముఁడు పాండవాగ్రజుకనియె :
"నంతరంబెఱుఁగనియట్టివీనికిని
బ్రియము చెప్పంగను బేలవె నీవు !
నయవిహీనుఁడు జగన్నాథదూషకుఁడు
శిశువు క్రూరాత్ముఁ డీశిశుపాలుఁ ; డతని
వశవర్తుఁ జేయంగవలదు నీకధిప!”
అని ధర్మసూసున కంతయుఁ జెప్పి
జననాథచంద్రుండు జాహ్నవీసుతుఁడు
బాలుండయిన శిశుపాలునికనియె:
"నేలరోషంబు లక్ష్మీశ్వరుమీఁద !
తగదంటివర్ఘ్యంబు ధంణీధరునకుఁ
దగవెఱుంగవు మహాధర్మబాహ్యుఁడవు :
క్రూరచిత్తుండవు కుంభినిలోన ;
నేరుపెఱుంగవు నీతిదూరుఁడవు ;
హరితోడఁ బోరినయట్టివారెల్ల
[1]మరణంబులగుదురు; మఱి కైటభారి
శరణన్నవారెల్ల జయమునొందుదురు;
సరసిజాక్షునితోడ శత్రుత్వమేల !

  1. మృతులగుదురనునర్ధములో నిట్టిప్రయోగము శ్రీనాథునిరచనయందును గలదు.
    'మాటనాల్కనయుండంగ మరణమయ్యె. ' కాశీ , 5 అ, 154 ప.