పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/602

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

536

ద్విపద భారతము.


భూతినీలగ్రీవ, పోషితజీవ,
నీతిపద్మజదేవ, నిత్యస్వభావ, (?)
నుతమహీదేవ, మానుషబలదేవ,
చతురకళాదేవసమ సహదేవ, (?)
శరణులఁగాన సజ్జనులనుబ్రోవ
బరఁగ విష్ణునిసేవఁ బరఁగితి వీవ;
నీకు నెవ్వరుసరి నృపులులోకముల!
రాకాసుధాకరారవితారకముగ
మన్నింపు; నిలుపుము మము రాజ్యములను
ఉన్నతి." ననవుడు నుప్పొంగి వేడ్క,
నాసహదేవుండు నా రాజుకనియె:
"భాసురప్రౌఢితో, బరఁగ రాజ్యంబు
సేయుము; నేఁగల్గఁ జింతనీ కేల!
ఏయెడ నీకునాకెంతయుఁ బొందు."
అని వానివీడ్కొని యట దక్షిణమునఁ
జని మహారాష్ట్ర రాజన్యులచేత
సకలార్థములుగొని, సాగరద్వీప
నికటనిషాదులు, [1]నిజకాలముఖులు,
కర్ణసత్ప్రభులు, రాక్షసయోధవరులు,
స్వర్ణవర్ణులు రామశైల సుతామ్ర
పతులు, ద్వీపజయంతి పట్టణాధిపులు,
నతులిత వశపరులై తన్నుగొలువఁ
బోయి కేరళ పాండ్య పుండ్ర కాళింగ
నాయకులను [2]బ్రధనంబున గెలిచి,
ద్రావిడ యవన గాంధారభూపతుల
లావుననోర్చి, చాలఁగ లక్ష్మిఁగొనుచు

  1. ఇట్టిపదములను వ్యర్థముగాఁ బ్రయోగించుట యీతనిపరిపాటి.
  2. ప్రదరము (మూ )