పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/587

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సభాపర్వము ; ప్రథమాశ్వాసము

521


వారిరక్షింపను వరుస నీతోడఁ
బోరాడఁగా నేము, భుజబలంబునను
వచ్చితి, మీతండు వాయునందనుఁడు;
సచ్చరిత్రుఁడు వీఁడు శక్రనందనుఁడు;
ఏను శ్రీకృష్ణుఁడ; నెల్లదుర్జనులఁ
బూనిశిక్షింపంగఁ బుట్టినవాఁడ.
నిన్నాజిఁదెగటార్చి నృపతుల నెల్ల
నెన్నిక కెక్కంగ నీక్షణంబునను
విడిపింతు మము దేవనిసరంబుపొగడ
గడిమితో." ననవుడు గడువడి నలిగి,
యాజరాసంధుండు నాగ్రహంబునను
రాజసంబున మృగరాజుచందమును
గుటిలసద్భ్రుకుటీ[1]విగుర్వణఘటిత
నిటలుఁడై పటుకార్యనిర్భరత్వమున
వారితోఁబలికె దుర్వారవైరమున :
"ధారుణీశులగెల్చి తఱిఁబట్టి తెచ్చి
కారాగృహంబులం గడిమితోఁబెట్టి
భైరవపూజలు పరఁగఁజేయుచును
ఇలలోపలను గ్రొవ్వి యేచియుండుటలు
తలపోయఁగా వీరధర్మంబుగాదె!
నాకుదోషములేదు నవరణస్థలులఁ
జేకొని పట్టి తెచ్చినమహీపతుల
దేవహితార్థంబు తెగవేయువాఁడ;
నీవేళ వారల నే నేలవిడుతు!
భావింప నాప్రతాపము లోకములను
నీ వెఱుంగవె ధారుణీధర, యెపుడు!

  1. నికుర్వణ (మూ )