పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/576

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

510

ద్విపద భారతము.


అటుగాన నీతోయజాక్షునికృపను,
స్ఫుటశౌర్యుడైన యర్జునుసహాయమున,
నిత్యమైయొప్పెడు నీప్రసాదమున,
నత్యున్నతుండైన యాజరాసంధు
నఖిలజగద్ద్రోహి నాజిఁ ద్రుంచెదను.
నిఖిలం బెరుంగంగ నేము మువ్వురముఁ
ద్రేతాగ్నులునుబోలెఁ దేజంబుతోడ
ఖ్యాతిగా, నీ యజ్ఞకార్యమంతయును
నిర్వహింతుము; దుర్వినీతు మాగధుని
దుర్వారపశువుఁ గ్రతుక్రమంబునను
ఆహుతులుగవ్రేల్చి యలరియుండుదుము
సాహసంబున." నన్న శక్రనందనుఁడు
ననిలజుమాటల కనుకూలముగను
జననాథుతోడ సద్భక్తిని బలికె :
“ఆజిలో రిపురాజినడఁచి, [1]లక్ష్ములను
రాజసూయమహాధ్వరమ్ము గావింపు
నాభుజబలమున నాధనుర్విద్య
ప్రాభవంబున జగత్ప్రఖ్యాతముగను,
ఈసభాలాభంబు నీ ప్రతాపంబు
నీసమస్తశ్రీలు నిటనీకుఁగలుగ,
నేవిచారములేల యిలనాథచంద్ర!
కోవిదస్తుతమునై కులశీలరూప
గుణములకును ననుకూలమైయొప్పి
ప్రణుతికెక్కిన నీప్రభావంబునందు
సమరంబునను జరాసంధునిఁ ద్రుంచి,
క్రమమునఁ జెఱనున్నరాజుల నెల్ల

  1. ఈపదమును వైభవపర్యాయముగా పదింపదిగా వాడును.